పరిపాలనా పరంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. మరోసారి మాజీలకు భద్రతను కుదింపు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తిగా గన్‌మెన్లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. విపక్ష నేతల భద్రతను భారీగా తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పుడు మరోసారి మాజీలకు భద్రతను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అది మరో పెద్ద చర్చకు దారితీస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో అనేక మంది మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. అయినా వారిలో ఇప్పటికీ చాలా మందికి భద్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలోని విపక్ష పార్టీలైన.. టీడీపీ, కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముంది. మొత్తానికి మాజీలకు గన్‌మెన్లను ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన అమలులోకి వస్తుందా? లేదా అన్నది చూడాలి.