గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. పీపీఏలలో అవినీతి లేదని, విద్యుత్ రంగానికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవద్దని కేంద్రమంత్రి, కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖలు రాసినా మూర్ఖంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. తమ చేతకానితనం కప్పిపెట్టుకోవాలనే వైసీపీ నేతలు ఈ విధంగా చేస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై కేంద్రం ఒకటి చెబుతుంటే రాష్ర్ట ప్రభుత్వం మరొకటి చెబుతోందని మండిపడ్డారు.
టీడీపీని టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని పంతం పట్టినట్టుగా వీరి పాలన ఉందన్నారు చంద్రబాబు. వైసీపీ నేతల వ్యవహార శైలితో పోలవరం నిర్మాణం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర నిర్మాణంపై వీరికి శ్రద్ధ లేదని, తమ ప్రభుత్వ హయంలో నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు చంద్రబాబు.