
పవిత్ర పుణ్యక్షేత్రం.. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ఇతర మతాలకు చెందిన ప్రకటనలు కనిపించడంతో భక్తులు ఖంగుతిన్నారు. ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ టికెట్ల వెనుక భాగంలో దర్శనమిచ్చాయి. దీంతో సదరు భక్తులు ఆ టికెట్‌కి సంబంధించిన ఫోటోస్ తీసి.. కంప్లైంట్ చేశారు. తిరుమల క్షేత్రంలో అన్యమతాల ప్రచారంపై ఇప్పిటికే నిషేధం ఉంది. టికెట్ల వెనుకభాగంలో ముస్లిం, క్రిస్టియన్ మతాలకు సంబంధించిన యాడ్స్ దర్శనం ఇవ్వడంతో శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఈ ప్రకటనలపై శ్రీవారి భక్తులు భగ్గుమన్నారు. హజ్, జరూసలేం యాత్రలపై ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు భక్తులు. ఇలాంటి సందర్భంలో తిరుమల పవిత్రతను, ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత టీటీడీతో పాటు ప్రతీ ఒక్కరిపై ఉందని భక్తులంటున్నారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ప్రయత్నించే ఎలాంటి శక్తులనైనా అడ్డుకోవాలని భక్తులు కోరుతున్నారు. సాక్షాత్తు ప్రభుత్వ సంస్థగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ టికెట్లపై అన్యమతం ప్రచారం చేయటం ఏమిటనే విమర్శలు వ్యక్తమవతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆలయ పవిత్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే ఇది పొరపాటుగా జరిగిందా లేక కావాలనే చేశారా అనే అంశంపై తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.