రైతుల డిమాండ్లు తీర్చకపోతే జనవరి నుంచి ఢిల్లీలో ఆందోళన, అన్నాహజారే ప్రకటన, ప్రభుత్వంపై తీవ్ర విమర్శ

| Edited By: Pardhasaradhi Peri

Dec 29, 2020 | 12:25 PM

రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా జనవరి నుంచి నిరసన ప్రారంభిస్తానని సామాజికవేత్త, అవినీతివ్యతిరేక ఉద్యమ నేత..

రైతుల డిమాండ్లు తీర్చకపోతే జనవరి నుంచి ఢిల్లీలో ఆందోళన, అన్నాహజారే ప్రకటన, ప్రభుత్వంపై తీవ్ర విమర్శ
Follow us on

రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా జనవరి నుంచి నిరసన ప్రారంభిస్తానని సామాజికవేత్త, అవినీతివ్యతిరేక ఉద్యమ నేత అన్నాహజారే ప్రకటించారు. ఈ లోగా ప్రభుత్వం వారి డిమాండ్లను తీర్చాలని అయన కోరారు. రైతుల ప్రయోజనాలకోసం గత మూడేళ్ళుగా తాను ప్రొటెస్ట్ చేస్తున్నా వారి సమస్యల పరిష్కారానికి సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన ఆరోపించారు. మొదట 2018 మార్చి 21 న తను రామ్ లీలా మైదానంలో నిరాహారదీక్ష చేశానని, నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గజేంద్రసింగ్  షెఖావత్, అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ తనను కలిసేందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. రైతుల కోర్కెలు తీరుస్తామని వారు అప్పుడు లిఖిత పూర్వక హామీలు ఇచ్చారన్నారు. కానీ ఏదీ జరగలేదన్నారు. దీంతో మళ్ళీ 2019 జనవరి 30 న నేను నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే , దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారని, కానీ పరిస్థితి ఏ మాత్రం మారలేదని అన్నాహాజారే చెప్పారు.

దీంతో మళ్ళీ నిరసన ప్రారంభించాలని అనుకుంటున్నాను.. ఈ విషయాన్ని కేంద్రానికి ఓ లేఖ ద్వారా తెలియజేశాను అని 83 ఏళ్ళ హజారే తెలిపారు. ఢిల్లీలో తాను చేసే ప్రొటెస్ట్ ఇదే చివరిది కావచ్చునన్నారు. ప్రభుత్వం డొల్ల హామీలు ఇస్తోందని, ఇప్పటివరకు నిర్దిష్టంగా ఇది చేసాం అని చెప్పడానికి సర్కార్ వద్ద ఏదీ లేదని ఆయన విమర్శించారు. ఇక నాలో సహనం నశించింది అన్నారు.