AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ పొలిటికల్ రౌండప్ 2020 : రాజకీయ వింతలు, విడ్డూరాలు.. ఏపీలో కాకరేపిన పొలిటికల్ ట్రిక్స్ అండ్ గిమ్మిక్స్

ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ వచ్చిన 2020వ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేనంత వింతైన అనుభవాలను ప్రజలకు పోగేసి ఇచ్చింది. ఈ ఏడాదిలో..

ఏపీ పొలిటికల్ రౌండప్ 2020 : రాజకీయ వింతలు, విడ్డూరాలు.. ఏపీలో కాకరేపిన పొలిటికల్ ట్రిక్స్ అండ్ గిమ్మిక్స్
Venkata Narayana
|

Updated on: Dec 31, 2020 | 6:27 PM

Share

2020 Round Up ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ వచ్చిన 2020వ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేనంత వింతైన అనుభవాలను ప్రజలకు పోగేసి ఇచ్చింది. ఈ ఏడాదిలో దాదాపు 9 నెలలపాటు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకూ అంటే ఐదు నెలలపాటు జనజీవనం దాదాపు నూటికి నూరుశాతం స్థంభించిపోయింది. ఇక, సందట్లో సడేమియాలా ఇంతటి సంక్షోభసమయానా.. పొలిటికల్ మసాలాకేం లోటురాలేదు 2020లో. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనేక సంచలన నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్త అలజడిని, సరికొత్త ఉత్తేజాన్ని రగిలించాయి. ఇక, ఏపీలో కాంగ్రెస్ పార్టీ మచ్చుకైనా కనిపించక, దాదాపు ఆపార్టీ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. ఇక, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పరుగులు, అడుగులు, సంచలన ఘట్టాలు.. నేటితో ముగుస్తోన్న ఈ ఏడాదిలో ఏం జరిగాయో ఓ లుక్కేద్దాం..

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు :

2020 వ కొత్త సంవత్సరంలోకి అడుగిడుతూనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ప్రకటనతో సంచలనం రేపారు. తొలి నెల జనవరిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతకముందు జగన్ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందగా, తెలుగు దేశం పార్టీ సభ్యులు మెజారిటీగా ఉన్న శాసనమండలిలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

ఉవ్వెత్తున లేచిన అమరావతి ఉద్యమం :

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రకటనతో అమరావతి రైతులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు రోడ్డెక్కి సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ పోరు 2020 డిసెంబర్ 17వ తారీఖుతో ఏకంగా ఏడాది పూర్తి చేసుకుని ఇంకా కొనసాగుతూ వస్తోంది. అమరావతి రాజధాని గ్రామాలైన తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, తాళ్లపాలెం, బేతపూడి.. ఇలా.. ఆయా చోట్లా ఉద్యమం కొనసాగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా :

కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే యథావిధిగా ఎన్నికల కోడ్ కొనసాగుతుందని చెప్పారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సీఎం జగన్ సంచలన ఆరోపణలు :

స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరిట వాయిదా వేయడంతో సీఎం జగన్ తీవ్ర ఆగ్రహావేశానికి గురయ్యారు. తనకు మాటైనా చెప్పకుండా నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం తీసుకుంటారా అంటూ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదిపారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

కొత్త ఎస్ఈసీగా కనకరాజు నియామకం విషయంలో చెక్కెదురు :

ఏపీ ఎన్నికల కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ను పదవి నుంచి తప్పించి.. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనకరాజును ఎస్ఈసీగా నియమించారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా రావడంతో తిరిగి ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వంపై ఆయన మార్చిలో ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోన్న సంగతి తెలిసిందే.

అవినీతి ఆరోపణల్లో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ :

కరోనా విజృంభిస్తున్న వేళ ఏసీబీ అధికారులు జూన్ 12 న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి.. సోదాలు కూడా నిర్వహించారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అయితే బెయిల్‌పై అచ్చెన్నాయుడు విడుదలయ్యారు.

రాజ్యసభకు నలుగురు వైసీపీ సభ్యులు :

జూన్ 19న ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం నాలుగు స్థానాలనూ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు విజయం సాధించారు.

సీఎం జగన్ ను కలిసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ :

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన మిత్రుడు పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని ముఖేష్ కోరగా, అందుకు సుముఖత వ్యక్తం చేసిన సీఎం జగన్, పరిమళ్ నత్వానికి ఎంపీ పదవి కట్టబెట్టారు.

కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు :

2020 వ సంవత్సరంలో జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కీలక తీర్పులు వచ్చాయి. దీంతో కోర్టులపై వైసీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో వారిపై విచారణకు సైతం కోర్టు ఆదేశించింది.

సంచలనం రేపిన ఏపీ సీఎం జగన్ లేఖ:

అక్టోబర్ మొదటి వారంలో ఏపీ న్యాయ వ్యవస్థ పనితీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాయడం సంచలనం రేపింది. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీ హైకోర్టును సుప్రీం కోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని సీఎం జగన్ తనలేఖలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సీఎం జగన్ ఆరుగురు జడ్జిలను టార్గెట్ చేశారు. వీరిలో సుప్రీం కోర్టు న్యాయవాది జస్టిస్ ఎన్వీ రమణ ఉండగా, తర్వాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ డి.రమేష్ ఉన్నారు.

జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక మలుపులు :

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కమ్యూనిస్టు పార్టీలతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో దోస్తీకి సై అంది. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం అయ్యారు. మరో సంచలన విషయం ఏంటంటే, పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సొంత పార్టీ వైసీపీపై తిరుగుబావుటా ఎగురవేసి, వైఎస్ఆర్ సీపీ నేతలు, అధినేత జగన్ మీదా వరుస విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది. ఇక, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ను పార్టీ అధిష్టానం నియమించింది.