
land records gives within five minutes: ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర రీసర్వేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పకడ్బందీగా పూర్తిచేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ పేర్కొన్నారు. ఐదు నిమిషాల్లోనే ల్యాండ్ రికార్డ్స్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో 14 వేలమంది సర్వేయర్లు ఉన్నారని, వారికి శిక్షణ ఇస్తే రాష్ట్రంలో నైపుణ్యంగల మానవ వనరులు పుష్కలంగా ఉన్నట్లవుతుందని తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అలాగే తిరుపతిలో సర్వే అకాడమీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ప్రయివేటు సర్వేయర్లకు కూడా శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. దేశంలో భూసర్వే చేపట్టి జాతీయ స్థాయిలో సర్వే మ్యాపులు రూపొందించే పనిలో ప్రపంచంలోనే పురాతన సంస్థగా సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక అటవీ భూములు మినహా పొలాలు, గ్రామకంఠాలు, పట్టణ ఆస్తులను సర్వేచేసి ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు విశేష గుర్తింపు సంఖ్య ఇస్తామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్‌కుమార్‌ప్రసాద్ తెలిపారు.