ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా.. అంతకముందు సభలో రసాభాస.. 13 మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్

| Edited By: Sanjay Kasula

Nov 30, 2020 | 5:58 PM

ఏపీ  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను రెడీగా ఉన్నాయి. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా.. అంతకముందు సభలో రసాభాస.. 13 మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్
Follow us on

తొలి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరిగాయి. వరద సాయంపై ప్రతిపక్ష సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్‌. ఆ తర్వాత మాట్లాడేందుకు ప్రయత్నించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. సంప్రదాయానికి విరుద్దంగా చంద్రబాబు ఎలా మాట్లాడతారని అధికారపార్టీ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ తనకు అవకాశం ఇచ్చినప్పుడు మీరెలా అడ్డుకుంటారని నిలదీశారు. అక్కడా మాటా మాటా పెరిగింది. చివరకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతిపక్ష నేత పోడియం దగ్గరే బైటాయించారు.

ఆయనతోపాటు ప్రతిపక్ష సభ్యులూ అక్కడే బైటాయించారు. ఈ పరిణామంపై సీఎం జగన్‌ సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యారు. రౌడీయిజం చేసింది కాకుండా… మళ్లీ తమకు అన్యాయం జరిగిందని చెప్పడం ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కావాలనే సభ జరగకుండా అడ్డుకోవడానికే చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

స్పీకర్ పదేపదే చెప్పినా వినకపోవడంతో అధికార సభ్యుల ప్రతిపాదనలతో పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా… విపక్షానికి చెందిన 13 మంది సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేశారు. అంతేకాదు.. చంద్రబాబు తీరుపై చర్యలకు రూల్ 77 ప్రకారం తీర్మానం కూడా చేశారు.

అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వాడి వేడిగా సాగాయి. ఇకమీదట ఎలాంటి రాజకీయ మంటలు చెలరేగుతాయో చూడాలి.