సోమవారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక చట్టాలు తేవాలని వైసీపీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ ప్లాన్స్..

|

Nov 29, 2020 | 7:37 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు సభా సమావేశాలు..

సోమవారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక చట్టాలు తేవాలని వైసీపీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ ప్లాన్స్..
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు సభా సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, సోమవారం ఉదయం 8 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ప్రవేశ పెట్టే బిల్లులు, తదితర అంశాలపై ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు చర్చింనున్నారు. మరోవైపు ఈ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్యాంబ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టం చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరిధిలోకి ఎర్రచందనం స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అంశాలను కూడా చేరుస్తూ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది.

ఇదిలాఉండగా, శాసనసభా సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి విపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ సభ్యులు నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల్లో దాదాపు 20 అంశాలపై చర్చ జరపాలని టీడీపీ పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి హామీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి, ఇసుక పాలసీ, పోలవరం ప్రాజెక్టు, స్థానిక ఎన్నికలు, దేవాలయాలపై దాడులు వంటి అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది. అలాగే సభను కనీసం 10 రోజులైనా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.