
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలన్నది బీజేపీ లక్ష్యం.. అక్కడ కాషాయపు జెండాలు రెపరెపలాడటం చూడాలన్నది అమిత్ షా ధ్యేయం.. ఇందుకు అవసరమైన వ్యూహాలను పన్నుతోంది బీజేపీ అధినాయకత్వం.. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి.. అంటే ఎక్కువ సమయం లేదు.. అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా బీజేపీ ప్రమాదకరంగా మారుతోందని తెలుసుకుంది.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు చూసి తృణమూల్ కూడా ఆశ్చర్యపోయింది.. ఆ తర్వాత ఆందోళన చెందింది.. బెంగాల్‌లో బీజేపీ ఇంతగా బలపడిందంటే అందుకు కారణం అమిత్‌షానే! ఇప్పుడు కూడా అమిత్‌షాకే ఆ బాధ్యతను అప్పగించింది అధినాయకత్వం.. రేపు, ఎల్లుండి అమిత్‌షా బెంగాల్‌లో పర్యటించే అవకాశం ఉంది.. అమిత్ షా పర్యటనతో బీజేపీ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం రావడం ఖాయం.. ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేట్టుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అమిత్‌షా.. అయితే బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హాను జాతీయ కార్యదర్శిగా తొలగించడం చాలామందికి నచ్చడం లేదు.. పైగా ఆ ప్లేస్‌లో ఒకప్పటి తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్‌రాయ్‌ను కూర్చోబెట్టడం ఇంకా నచ్చడం లేదు.. ఈ విషయంలోనే బీజేపీ క్యాడర్‌లో ఓ మోస్తరు అసంతృప్తితో ఉంది. మూడేళ్ల కిందట బీజేపీలో చేరిన ముకుల్‌రాయ్ ఇప్పుడు పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడయ్యారు.. రేపు, ఎల్లుండి జరిగే పర్యటనలో అమిత్ షా బాంకురా, కోల్‌కతా పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు మమతా బెనర్జీ. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోని మమతా బీజేపీని చూసి కొద్దిగా జంకుతున్నారు. ఇందుకు అమిత్‌షా ఎన్నికల వ్యూహాలు కారణం కావచ్చు.. బీజేపీ సాధిస్తున్న విజయాలు కావచ్చు. బెంగాల్ ప్రజలకు దసరా నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యం.. అందుకే మొదటిసారి ప్రధాని నరేంద్రమోదీ దసరా పండుగ రోజున బెంగాల్ ప్రజలను పలకరించారు.. బెంగాలీలో కాసేపు ముచ్చటించారు.. ఆ విధంగా బెంగాలీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. మొత్తంగా బీజేపీకి రథి, సారథి అయిన మోదీ, అమిత్‌షా ద్వయం బెంగాల్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టారని తెలుస్తోంది..