US on international passengers : కరోనా మహహ్మరితో విలవిలలాడిన అగ్రరాజ్యాన్ని కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో మరికొద్దిరోజులపాటు కోవిడ్ ఆంక్షలను పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు యూఎస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనలు జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. దీనిపై అమెరికా ఉన్నతాధికారలు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
బ్రిటన్‌లో వెలుగుచేసిన కరోనా స్ట్రెయిన్ వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో పలు దేశాల్లోనూ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే అమెరికా కూడా యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కాగా, సీడీసీ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తించనున్నట్లు తెలుస్తోంది.
Read Also… అమెరికాకు హ్యాకర్ల సెగ.. వివిధ ప్రభుత్వ శాఖలపై సైబర్ నేరగాళ్లు భారీగా మాల్‌వేర్‌తో దాడులు..!