
ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మూడు రాజధానుల అంశంతో రాష్ట్రమంతటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు అయితే సీఎం నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతూ నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని ప్రాంతం చుట్టుప్రక్కల 29 గ్రామాల్లోని రైతులు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అమరావతి రైతులు క్యాపిటల్ విషయంలో ప్రధాని మోదీకి లేఖలు రాశారు.
రాజధాని వికేంద్రీకరణపై పార్టీ విధానం చెప్పాలంటూ రైతులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. రాష్ట్ర బీజేపీ నేతల భిన్నాభిప్రాయాలతో గందరగోళం నెలకొందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు వికేంద్రీకరణకు వ్యతిరేకిస్తుండగా.. ఎంపీ జీవీఎల్ స్వాగతించడాన్ని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. అటు రాష్ట్ర నాయకత్వానికి కూడా రాజధాని అంశంపై సరైన మార్గదర్శకం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ స్థాయి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.