ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు 28 ఏళ్ల వ్యక్తి పొత్తికడుపు నుండి 20 సెంటీమీటర్ల పొడవైన కత్తిని తొలగించారు. జూలై 12 న, హర్యానాకు చెందిన వ్యక్తిని సెంటర్-సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స కోసం ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. ఎయిమ్స్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ఎన్ ఆర్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడ్ని అత్యవసర పరిస్థితుల్లో ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. మొదట, వైద్యులు అతని కోవిడ్ పరీక్షను నిర్వహించారు. నెగిటివ్ రావడంతో వెంటనే ట్రీట్మెంట్ ప్రారభించారు. బాధితుడు గంజాయికి బానిస అవ్వడంతో, అది దొరక్కపోయే సరికి కత్తిని మింగినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా సాధారణ జీవితం గడిపినట్లు వెల్లడించారు. ఇటీవల కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే తీయగా లోపల 20 సెంటిమీటర్ల కత్తి కనిపించడంతో షాక్ కు గురయ్యారు వైద్యులు.
జులై 19 తేదీన అతడికి సర్జరీ చేశారు. కత్తి లివర్ కు అతి దగ్గరగా ఉండటంతో వైద్యులు ఆపరేషన్ సమయంలో తీవ్రంగా కష్టపడ్డారు. దాదాపు 3 గంటలు శ్రమించి ఎట్టకేలకు కత్తిని బయటకు తీశారు. కత్తి పిత్త వాహిక, రక్త నాళాలకు దగ్గరగా ఉందని, ఒక చిన్న పొరపాటు అతని జీవితాన్ని కూడా పెద్ద ప్రమాదంలో పడుతుంది కాబట్టి పక్కా ప్రణాళికతో ఆపరేషన్ చేసినట్టు వైద్యులు తెలిపారు. రేడియాలజిస్ట్ మొదట..బాధితుడి ఉపిరితిత్తులు, కాలేయం నుంచి చీమును తొలగించి, ఇన్ఫెక్షన్ పాకకుండా ఉండేలా చేశారు. ఆ తర్వాత మానసిక వైద్యులు బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆపై రేడియోస్కోపీ ద్వారా కత్తి బయటకు తీశారు.