ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివురుగప్పిన నిప్పులా ఆదివాసీ ఉద్యమం.? ‘మావ నాటే మావ సర్కార్’ నినాదంతో మళ్లీ తుడుం దెబ్బ.!

అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆదివాసీ ఉద్యమం మళ్లీ నివురుగప్పున నిప్పులా మారుతుందా.? 'మావ నాటే మావ సర్కార్' నినాదాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివురుగప్పిన నిప్పులా ఆదివాసీ ఉద్యమం.? 'మావ నాటే మావ సర్కార్' నినాదంతో మళ్లీ తుడుం దెబ్బ.!
Follow us

|

Updated on: Dec 16, 2020 | 7:53 AM

అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆదివాసీ ఉద్యమం మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారుతుందా.? ‘మావ నాటే మావ సర్కార్’ నినాదాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ తుడుం మ్రోగబోతోందా .? ఆదివాసీ వర్సెస్ లంబాడా ఉద్యమం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలోనే వరుస ఆందోళనలతో టెన్షన్ వాతవరణం కనిపిస్తుండటమే దేనికి‌ సంకేతమా.! తుడుందెబ్బ పిలుపుతో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కదిలిన ఆదివాసీ దండు మరోసారి ఆందోళనను తీవ్రతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా..? వరుస పులి దాడులతో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం.. ఆగ్రహంగా మారి ఆందోళనకు దారి తీస్తోందా.? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అస్తిత్వం కోసం పోరు సలిపిన ఆదివాసీలు.. ఇక హక్కుల సాధనే లక్ష్యంగా ఆందోళనకు సై అంటున్నారు. దీంతో జల్ జంగిల్ జమీన్.. అడవి బిడ్డల పోరుగడ్డ మరోసారి సమరానికి సన్నద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. హక్కుల సాధనే లక్ష్యంగా మలిదశ ఉద్యమానికి తుడుం మ్రోగిస్తోంది. ఎవరి అంచనాలకు అందకుండా చాపకింద నీరులా విస్తరిస్తూ ఆదివాసీ పల్లెల్లో ఆందోళనకు సై అంటోంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించడమే లక్ష్యంగా ఆదివాసీల అభివృద్ధే ధ్యేయంగా ఈ సారి పోరు సలిపేందుకు సైసై అంటోంది.

ఆదివాసీ వర్సెస్ లంబాడా ఉద్యమం మరోసారి తెర మీదకొచ్చే అనుమానాలు ఉండటంతో అడవుల జిల్లా ఆదిలాబాద్ మరోసారి భయంతో వణికిపోతోంది. ఆనాటి హస్నాపూర్ ఘటనను గుర్తు చేసుకుంటోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ‘మావా నాటే మావా రాజ్’ ఉద్యమం మళ్లీ చేప కింద నీరులా విస్తరిస్తోంది. మూడేళ్ల క్రితం ఆదివాసీ ఉద్యమం విషయంలో యంత్రాంగం తప్పటడుగుతో భారీ మూల్యం చెల్లించుకున్న అధికారులు.. ఈ సారి కూడా మరో తప్పటడుగు వేస్తున్నారా అన్న భావన కలుగుతోంది. గత ఏడాది డిసెంబర్‌ 9న ఢిల్లీ సాక్షిగా తలపెట్టిన మహాగట్ ఆదివాసీ సమ్మేళన్ ను పునరావృతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెల 9న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీలు ధర్నాలు‌, రాస్తారోకోలతో మరోసారి బలనిరూపణ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బలప్రదర్శనలు చేపట్టారు. ఆదివాసీ తొమ్మిది తెగలు ఉమ్మడిగా కదతొక్కడంతో ఉద్యమం మరోసారి ఉదృతం అవుతుందన్న అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. గతంలో పోడు భూములు , హక్కుల సాధన, లంబాడీ వ్యతిరేక నిర్ణయంతో కదం తొక్కిన ఆదివాసీలు ఈ సారి.. తమ బతుకుపై గుది బండలా మారిందనుకుంటున్న జీవో నెం3 పై తీవ్ర ఆగ్రహంతో ఆందోళన బాటపట్టాయి.

దీనికి తోడు ప్రభుత్వం‌ తీసుకు వచ్చిన ఎల్ఆర్ఎస్ , ఆస్తుల సర్వే పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆదివాసీల్లో అభద్రత భావం నెలకొంది. పీసా హక్కు చట్టాలను తుంగలోకి తొక్కుతూ షెడ్యూల్ 5 నిబందనలను అమలు చేయకుండా తమ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆదివాసీలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదే సమయంలో ఆదివాసీ గ్రామాల సమీపంలో నిత్యం పులుల సంచారం మనుషులపై పంజా విసరడం సైతం ఆదివాసీల ఆందోళనలకు మరోసారి ఆజ్యం పోసింది. శాంతియుతంగా నిరసన తెలిపితే ఫలితం రావడం లేదని.. ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు మరో భారీ ఉద్యమం తప్పదని అధికార యంత్రాంగానికి సున్నితంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగామే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉట్నూర్ , నార్నూర్ , ఇంద్రవెళ్లి ప్రాంతాల్లో డిసెంబర్ 9న జరిగిన రాస్తారోకోలు, ధర్నాలు ఒక ఎత్తైతే.. డిసెంబర్ 15న అంటే నిన్న కొమురంభీం జిల్లా సాక్షిగా లంబాడీలపై తిరుగుబాటు సిద్ధమవడం ఇంకో ఎత్తు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తెలంగాణలోకి చొరబడి ఆదివాసీల హక్కులు అప్పన్నంగా లాగేసుకుంటున్నారని.. నిధులు నియమకాలను ఎస్టీలమంటూ లాగేసుకు పోతున్నారన్నది ఆదివాసీల ఆగ్రహం.