ప్రముఖ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి పాల్ వర్గీస్ (61) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణించిన సమయంలో, అమలా తన రాబోయే చిత్రం ‘అధో ఆంధ పరవై పోలా’ ట్రైలర్ లాంచ్ కోసం చెన్నైలో ఉన్నారు. ఈ వార్త విన్న తర్వాత ఆమె కేరళలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ పాల్ చర్చిలో 3 నుంచి 5 గంటల మధ్యలో అమలా తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాల్ వర్గీస్‌కి భార్య ఆన్నిస్ పాల్.. పిల్లలు అమల, అభిజీత్ ఉన్నారు. అమల సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు తండ్రి పాల్ వర్గీస్..ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత ఆమె నటిగా నిలదొక్కుకోవడంతో ఎంతో ఆనందించినట్టు అమలా పాల్ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.