కుమారుడిని విడదీసిన లాక్‌డౌన్.. నెల రోజుల తర్వాత..

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రుల నుంచి దూరమైన నాలుగేళ్ల కుర్రాడు నెల రోజుల తర్వాత తిరిగి తల్లి ఒడికి చేరాడు. కేరళలో

కుమారుడిని విడదీసిన లాక్‌డౌన్.. నెల రోజుల తర్వాత..

Edited By:

Updated on: Apr 26, 2020 | 6:04 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రుల నుంచి దూరమైన నాలుగేళ్ల కుర్రాడు నెల రోజుల తర్వాత తిరిగి తల్లి ఒడికి చేరాడు. కేరళలో జరిగిందీ ఘటన. కల్పెట్ట సమీపంలోని కంబలకాడ్‌కు చెందిన సజీత్-విష్ణుప్రియ దంపతులు మార్చిలో తమ నాలుగేళ్ల కుమారుడిని పాలక్కాడ్ జిల్లాలోని షోరానూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి పంపారు.

వివరాల్లోకెళితే.. సజీత్ కన్నూరులోని పయ్యానూర్‌లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. మార్చి నెల మధ్యలో ఆ ప్రాంతంలో కరోనా కేసు వెలుగు చూడడంతో సజీత్ కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. వారి క్వారంటైన్ పూర్తయ్యే సరికి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో బంధువుల ఇంట్లో ఉన్న కుమారుడిని తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో సజీత్-విష్ణుప్రియ జంట కల్పెట్ట ఎమ్మెల్యే సీకే శశీంద్రన్‌ను కలిసి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.

కాగా.. వీరి బాధను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే వయనాడ్ కలెక్టర్ డాక్టర్ అదీల అబ్దుల్లా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ పిల్లాడిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలని నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశాలతో పాలక్కాడ్‌కు చెందిన అగ్నిమాపక అధికారులు అనూప్, సంతోష్‌లు శుక్రవారం ఉదయం షోరాన్‌పూర్ వెళ్లి బంధువుల వద్దనున్న బాలుడిని తీసుకుని కోజికోడ్‌కు తీసుకొచ్చి కల్పెట్టలోని అగ్నిమాపక సిబ్బందికి అప్పగించారు.

ఈ క్రమంలో అక్కడి నుంచి వారు వయనాడ్ వెళ్లి బాలుడిని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో నెల రోజుల తర్వాత బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కుమారుడిని తిరిగి తమ దరికి చేర్చిన అధికారులు, కలెక్టర్, ఎమ్మెల్యేకు సజీత్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.