ముజఫర్‌పుర్ : బీహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా శోఖ్‌పుర్‌లోని జాప్‌సీ టోలాలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు దాదాపు 300 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రాజకీయ నేతల ప్రమేయంతో ఎవరో కావాలని నిప్పు పెట్టినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో వందల మంది నిరాశ్రయులయ్యారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాలలు ఎగిసి పడటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లలోని వారంతా పరుగులు తీశారు. ఇళ్ళలో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయింది. తమను ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికే కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మంగళవారమే కొందరు వ్యక్తులు వచ్చి తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ బెదిరించి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.