మునిసిపల్ పోరుకు అదిరిపోయే వ్యూహాలు

|

Jan 06, 2020 | 4:00 PM

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగినప్పట్నించి మూడు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తూనే గెలుపు గుర్రాల వేటలో తలమునకలయ్యాయి. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. ఒకట్రెండు రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేసి.. ప్రచారంపై ద‌ృష్టి సారించేలా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రణాళిక రూపొందించుకున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో టీఆర్ఎస్ పనులను చక్కబెడుతున్న మంత్రి కేటీఆర్.. మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలతోపాటు దాదాపు పనులన్నీ ముగించారు. జిల్లాల వారీగా పార్టీ […]

మునిసిపల్ పోరుకు అదిరిపోయే వ్యూహాలు
Follow us on

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగినప్పట్నించి మూడు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తూనే గెలుపు గుర్రాల వేటలో తలమునకలయ్యాయి. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. ఒకట్రెండు రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేసి.. ప్రచారంపై ద‌ృష్టి సారించేలా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రణాళిక రూపొందించుకున్నాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో టీఆర్ఎస్ పనులను చక్కబెడుతున్న మంత్రి కేటీఆర్.. మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలతోపాటు దాదాపు పనులన్నీ ముగించారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో కేటీఆర్.. రాష్ట్ర కార్యాలయంలోను.. జిల్లాల పర్యటనలోను పలు మార్లు సమాలోచనలు జరిపారు. వాటి ఆధారంగా రూపొందిన ప్రణాళికపై జనవరి 4న పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. మునిసిపల్ ఎన్నికలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పగించారు. ఓటమి పాలైన జిల్లాల మంత్రులకు ఉద్వాసన పలుకుతానని కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు అంతర్గత తగాదాలు కొనసాగుతుండగానే సన్నాహక సమావేశాలను పూర్తి కానిచ్చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ వేదికగా జరిగిన పార్టీ సీనియర్ల భేటీలో వి.హనుమంతరావు లాంటి వారు నిరసన స్వరాన్ని వినిపించినా.. అదేమీ పట్టనట్లు ఉత్తమ్ కుమార్ పార్టీ ప్రచారాస్త్రాలపై సమావేశాలు ముగించారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఈ అయిదున్నరేళ్ళలో నెరవేర్చని అంశాలపై దృష్టి పెట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో డీసీసీలకు బాధ్యతలను కట్టబెట్టింది టీపీసీసీ నాయకత్వం.

ఇంకోవైపు బీజేపీ కూడా మునిసిపల్ ఎన్నికలకు సర్వసన్నద్దమైంది. మునిసిపల్ ప్రాంతాల్లో తమకు పట్టుందని భావిస్తున్న కమలనాథులు.. ఉత్తర తెలంగాణ మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు రాజధాని చుట్టూ వున్న కొత్త పురపాలక సంఘాలపై ఫోకస్ చేశారు. జాతీయ స్థాయిలో నిప్పు రాజేసిన సీఏఏ; ఎన్నార్సీ వంటి అంశాలపై సభలు నిర్వహిస్తూ వాటిని మునిసిపల్ ఎన్నికల ప్రచార సభలుగా మార్చేస్తున్నారు బీజేపీ నేతలు. నిజామాబాద్ వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభ తెలంగాణలో పెద్ద ఎత్తున వేడి రాజేసింది. ఇంకోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ రహస్య భేటీలతో ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల్లో అసంతృప్తులుగా వున్న నేతలను మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్వంలోనే పార్టీలోకి తీసుకోవాలని, వారి ద్వారా ఒనగూరే ప్రయోజనంతో మునిసిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందాలని బీజేపీ నేతలు ప్లాన్ చేశారు.

అధికార పార్టీలో గెలుపు ధీమా ప్రస్ఫుటంగా కనిపిస్తుండగా.. మెరుగైన ఫలితాలు పొందుతామన్న ధీమా కాంగ్రెస్, బీజేపీ నేతల్లోను వ్యక్తమవుతోంది. బుధవారం నుంచి మొదలయ్యే నామినేషన్ల పర్వానికి మూడు ప్రధాన పార్టీలతోపాటు.. ఇండిపెండెంట్లు కూడా పెద్ద ఎత్తున సిద్దమవుతున్నారు.