
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక ఇంటర్య్యూను ఇచ్చారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో మోదీ తన గురించి పలు ఆసక్తికర విషయాలను అక్షయ్‌తో పంచుకున్నాడు. అవేంటంటే
1. నేను ప్రధాని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఒక సామాన్యుడు ఎప్పుడూ అలా ఆలోచించలేడు. నేను చాలా సాధారణ స్థితి నుంచి ఎదిగి ఈ పదవికి చేరుకున్నా. ఒకవేళ ప్రధాని పదవి కాకుండా నాకు చిన్న ఉద్యోగం వచ్చినా.. మా తల్లి చుట్టుపక్కల వారికి లడ్డూలు పంచుతుంది.
2. నాకు ఎమ్మెల్యే అయ్యేవరకు బ్యాంక్ అకౌంట్ లేదు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు దేనా బ్యాంకు వారు వచ్చి నా పేరు మీద ఓ పిగ్గీ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేశారు. అందులో నాకు కనీస బ్యాలెన్స్ ఉండేది కాదు. దీంతో వారు నా అకౌంట్‌ను క్లోజ్ చేయాలని అనుకున్నారు. అయితే 32సంవత్సరాల అయినప్పటికీ.. ఆ ఖాతా కొనసాగుతుందని వారు తెలిపారు. ఆ తరువాత నా జీతాన్ని అందులోనే జమ చేసుకునేవాడిని.
3. నా ప్రశ్నలకు నేను సమాధానాలను వెతుక్కోగలను. చిన్న వయసు నుంచే నాకు ఇది అలవాటుగా మారింది. దీనివలన అన్నింటికి నేను దూరం అవుతున్నాననే భావన నాలో పెరిగింది. ఆ తరువాత మా తల్లిని నాతో కలిసి ఉండమని అడిగాను. కానీ ఆమె అందుకు నిరాకరించి, గ్రామంలోనే ఉండిపోయింది. నిజానికి చెప్పాలంటే ఎప్పటి నుంచో నా తల్లికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాను.
4. నాకు అంత త్వరగా కోపం రాదు. కోపం మనలో నెగిటివిటీ పెరగడానికి కారణమౌతుంది. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కోపాన్ని చూపించే అవకాశం నాకు రాలేదు.
5. కోపాన్ని ప్రదర్శించడానికి, కఠినంగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏ సమయంలోనైనా నేను క్రమశిక్షణతో ఉండాలనుకుంటాను.
6. నేను ఎప్పుడైనా భావోద్వేగానికి గురైనప్పుడు, వాటన్నింటిని ఒక పేపర్ మీద రాసుకుంటాను. తరువాత దాన్ని పరిశీలించి, నా తప్పులను సరిదిద్దుకుంటాను. ఇప్పుడు నాకు అంత సమయం దొరకడం లేదు, కానీ అన్ని పరిస్థితుల్లోనూ నన్ను నేను కట్టడి చేసుకోగలను.
7. ఈ విషయాన్ని నేను చెప్తే అందరూ ఆశ్చర్యపోవచ్చు. ఎన్నికల సమయంలో ఇలా నేను చెప్పకూడదు. కానీ మమతా దీదీ నాకు ప్రతి సంవత్సరం బహుమతులు పంపుతుంది. ప్రతి యేడాది నాకు ఆమె నుంచి ఒకటి, రెండు కుర్తాలు అందుతాయి.
8. మహాత్మా గాంధీ నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతూనే ఉంటా. 9కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం దేశం సాధించిన విజయం, నాది కాదు.
9. రోజుకు నాలుగు గంటలే నిద్రపోతా. కానీ ఒత్తిడి లేకుండా పనిచేస్తా. అందుకే రిటైర్మెంట్ తీసుకున్న తరువాత బాగా నిద్రపోవాలనుకుంటున్నా.
10. సోషల్ మీడియాలో నా మీద వచ్చే మీమ్స్‌ను నేను ఎంజాయ్ చేస్తుంటా. అందులో మోదీని చూడను. చేసిన వారి క్రియేటివిటీని మాత్రమే చూస్తా. సోషల్ మీడియా ద్వారా సామాన్యుల అభిప్రాయాలను నేను అర్ధం చేసుకుంటా.