Pencil art: పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్రలు.. నిజంగా ఆ యువతికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

| Edited By: Balaraju Goud

May 28, 2024 | 2:03 PM

ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది.. ఆ ప్రత్యేకతను గుర్తించి కాస్తంత ఆలోచనకు సానబెడితే వారిలో దాగి వున్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. బాపట్ల జిల్లాకు చెందిన ఓ యువతి అరుదైన కళతో అందరినీ ఆకట్టుకుంటోంది.

Pencil art: పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్రలు.. నిజంగా ఆ యువతికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Pencil Art
Follow us on

ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది.. ఆ ప్రత్యేకతను గుర్తించి కాస్తంత ఆలోచనకు సానబెడితే వారిలో దాగి వున్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. బాపట్ల జిల్లాకు చెందిన ఓ యువతి అరుదైన కళతో అందరినీ ఆకట్టుకుంటోంది.

బియ్యం గింజలు, అగ్గిపుల్లలపై తయారుచేసిన సూక్ష్మ కళాఖండాలను ఇప్పటివరకు మనం చూశాం.. అయితే ఇప్పుడు అదే తరహాలో ఓ యువతి పెన్సిల్ చివర ఉండే కార్బన్ లెడ్లపై పలువురు జీవిత చరిత్రలు రాసి అందరి మన్ననలు పొందుతుంది. ఈ క్రమంలోనే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను పెన్సిల్ లెడ్లపై లిఖించి అమ్మవారికి సమర్పించింది.

మే నెల 18వ తేదీన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలు పలు ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత శ్రీవాసవి మాత జీవిత చరిత్రను ఇంగ్లీషులో పెన్సిల్ లెడ్లపై రాసింది. జీవిత చరిత్ర రాసిన చిత్రపటాన్ని ఒంగోలులో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు నియెజకవర్గంలోని స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహితకు చిన్నతనం నుంచి తనను తాను నిరూపించుకోవాలనే తపన ఉండేది. తనలో దాగివున్న ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే సూక్ష్మ కళపై మక్కువతో పెన్సిల్‌పై మహా భారతాన్ని లిఖించింది. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసింది. మహా భారతంలోని 18 పర్వాలను, 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు గాను ఆమె 810 పెన్సిల్స్‌ని ఉపయెగించింది. వాటిపై 67,230 అక్షరాలను 7,238 పదాలను పొందు పరిచింది.

స్వతహాగా చిన్నతనం నుంచి మహితకు మైక్రో ఆర్టిస్ట్ అవ్వాలని ఎంతో ఆశ ఉండేది. తన కూడా మైక్రో ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి పెన్సిల్ చివర ఉన్న కార్బన్ లెడ్లపై ప్రత్యేకంగా పలువురి జీవిత చరిత్రలు రాయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే గత మూడు సంవత్సరాలుగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి జీవిత చరిత్రను రాయాలని ఆలోచన చేసింది. మే నెల 18న మాత జన్మదినం సందర్భంగా ఐదు రోజులు కష్టపడి పెన్సిల్ లేడ్లపై అతి సూక్ష్మ రూపంలో ఇంగ్లీషులో అమ్మవారి జీవిత చరిత్రను రాసి చిత్ర పటాన్ని తయారు చేసింది. ఆ చిత్రపటాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూలమూర్తి ఆలయంలో సమర్పించింది.

చిన్నతనం నుంచి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే పెన్సిల్ లెడ్లపై జీవిత చరిత్రలు రాస్తున్నట్లు మహిత తెలిపింది. ఇప్పటికే 720 పెన్సిల్ లెడ్లపై భగవద్గీత లోని శ్లోకాలను మహిత రచించింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర, ప్రముఖ సినీ నటులు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి లాంటి గొప్ప వారి జీవిత చరిత్రలను పెన్సిల్ లెడ్లపై రాసి కుటుంబ సభ్యులకు మహిత ఆ చిత్రపటాలను అందించింది. ఆ చిత్రపటాలని చూసిన సంబంధిత కుటుంబ సభ్యులు మహిత ఎంతగానో అభినందించారు.

దీని కోసం ఓ తపస్సులా పనిచేసింది మహిత. పెన్సిల్స్‌ని ముందుగా బద్ధగా చీల్చి అందులోని లీడ్ 2 మిల్లీ మీటర్ల మందం ఉండేలా చూసుకుంది. అన్ని అనుకున్న విధంగానే సూక్ష్మ కళ తో అక్షరాలను, పదాలను అవలీలగా లిఖిస్తూ తాను అనుకున్నది దిగ్విజయంగా పూర్తి చేసి ఔరా అనిపించింది. ఇదే విధంగా మరిన్ని సమాజానికి ఉపయెగపడే రచనలను సూక్ష్మ కళతో పొందు పరిచి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకోవడం తన లక్ష్యమని చెబుతోంది మహిత. మహిత మొదటగా బియ్యపు గింజలపై కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా ,తాళం, బాణం, వినాయకుడు, కొంగా, మినపప్పు మీద సైతం చక్కనైన ఆకృతులను చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్‌ పై మహా భారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదును పెట్టింది.

అయితే సూక్ష్మ కళాకారునిగా ఇప్పటికే పలువురి మన్ననలు పొందిన మహిత ప్రతి ఒక్కరూ తన కళను ఆదరించాలని కోరుతుంది. రానున్న రోజుల్లో ఎంతోమంది జీవిత చరిత్రలు పెన్సిల్ లెడ్లపై రాసి వారి కుటుంబ సభ్యులకు అందజేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభుత్వం కాస్తంత ప్రోత్సాహం అందిస్తే తన లాంటి వారెందరో సూక్ష్మ కళతో రాణిస్తారని చెబుతున్నారు మహిత.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..