India Water Crisis: తగ్గుతున్న వనరులు.. దేశంలో తీవ్ర నీటి సంక్షోభం రావడం ఖాయమా..?

|

Jun 26, 2024 | 6:56 AM

నీటి ఎద్దడిపై మూడీస్‌ రిపోర్ట్‌ దేశాన్ని కలవరపాటు గురిచేస్తోందా?.. మరి కొన్నేళ్లలో దేశంలో తీవ్ర నీటి సంక్షోభం రావడం ఖాయమా?.. నీటి వనరుల వినియోగం సమర్థవంతం లేకుంటే దేశానికి పెను ముప్పు తప్పదా?.. సామాజిక అశాంతితోపాటు.. ఆర్థిక వ్యవస్థను నీటి ఎద్దడి కుదిపేయబోతోందా?.. ఇంతకీ.. ఏంటీ.. మూడీస్‌ రిపోర్ట్‌?.. నీటి ఎద్దడికి కారణం అవుతున్న పరిస్థితులు ఏంటి?.. అసలు.. నీటి సంక్షోభంపై మూడీస్‌ రిపోర్ట్‌ ఏం చెప్తోంది?

India Water Crisis: తగ్గుతున్న వనరులు.. దేశంలో తీవ్ర నీటి సంక్షోభం రావడం ఖాయమా..?
Water Crisis
Follow us on
నీటి ఎద్దడిపై మూడీస్‌ రిపోర్ట్‌ దేశాన్ని కలవరపాటు గురిచేస్తోందా?.. మరి కొన్నేళ్లలో దేశంలో తీవ్ర నీటి సంక్షోభం రావడం ఖాయమా?.. నీటి వనరుల వినియోగం సమర్థవంతం లేకుంటే దేశానికి పెను ముప్పు తప్పదా?.. సామాజిక అశాంతితోపాటు.. ఆర్థిక వ్యవస్థను నీటి ఎద్దడి కుదిపేయబోతోందా?.. ఇంతకీ.. ఏంటీ.. మూడీస్‌ రిపోర్ట్‌?.. నీటి ఎద్దడికి కారణం అవుతున్న పరిస్థితులు ఏంటి?.. అసలు.. నీటి సంక్షోభంపై మూడీస్‌ రిపోర్ట్‌ ఏం చెప్తోంది?..
దేశంలో త్వరలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదనే మూడీస్‌ రిపోర్ట్ కలవరపాటుకు గురిచేస్తోంది. భారత్‌లో నానాటికి పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని మూడీస్‌ సంచలన రిపోర్ట్‌ ఇచ్చింది. ఇది ఆహార ద్రవ్యోల్బణానికి, ఆదాయాల తగ్గుదలకు దారి తీసి, సామాజిక అశాంతిని సృష్టించగలదని హెచ్చరించింది. నీటి సరఫరా మీద ఎక్కువగా ఆధారపడే థర్మల్‌ విద్యుత్ ప్లాంట్లు, స్టీల్‌ ప్లాంట్లను ప్రభావితం చేయడం ద్వారా ఆయా రంగాలకు నష్టదాయకంగా మారుతుందని అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తుండటం, పారిశ్రామీకరణ, పట్టణీకరణ కారణంగా నీటి లభ్యత తగ్గిపోతుందని చెప్పింది. అందులోనూ.. తాగు, సాగు, పరిశ్రమలు, విద్యుత్‌తోపాటు.. ఇతర అవసరాల్లో 2050 నాటికి తీవ్రమైన నీటి ఎద్దడి ఉంటుందని మూడీస్ తెలిపింది. జూన్ నెలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతోపాటు.. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు 50 డిగ్రీలు దాటి.. నీటి సరఫరాపై తీవ్రంగా ప్రభావితం చూపడమే అందుకు నిదర్శమంటోంది.
మరోవైపు.. వేగంగా మారుతున్న వాతావరణ మార్పులతో నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుందని చెప్పింది మూడీస్‌ రిపోర్ట్‌. కరువు, వడగాలులు లాంటి తీవ్ర పరిణామాలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ ముప్పు అనే నివేదికలో తెలిపింది. నీటి సరఫరా తగ్గిపోవడంతో వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు దెబ్బతింటాయని వెల్లడించింది. ఫలితంగా ఆహార వస్తువుల ధరలు పెరిగిపోతాయని.. వ్యాపారాలు, ప్రజల ఆదాయాలు తగ్గిపోతాయని తెలిపింది. ఫలితంగా.. దేశ వృద్ధిరేటు దెబ్బతింటుందని.. ఆర్థిక సామర్థ్యాన్ని నీరుగార్చుతుందని మూడీస్‌ నివేదిక తెలిపింది. కానీ.. నీటి నిర్వహణపై ఇప్పుడే ఫోకస్‌ చేయడం ద్వారా నీటి ఎద్దడి ముప్పు నుంచి బయటపడవచ్చని పేర్కొంది. ఇక.. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ గణాంకాలను ప్రస్తావించింది మూడీస్‌ రిపోర్ట్‌. ఇప్పటికే.. రుతుపవన వర్షపాతం కూడా తగ్గుతుందని, కరువు, కాటకాలు పెరుగుతున్నాయని తెలిపింది.
2023లో కురిసిన వర్షపాతం 1971 నుంచి 2020 మధ్య కురిసిన సగటు వర్షపాతం కంటే ఆరు శాతం తక్కువని వెల్లడించింది. అంతేకాదు.. గతేడాది ఆగస్టులో మునుపెన్నడూ లేనంత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే.. కేంద్ర జలవనరులశాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో నీటి డిమాండ్‌ ఎలా ఉంటుందో కూడా వివరించింది మూడీస్‌ రిపోర్ట్‌. 2010 నుంచి మొదలై 2025, 2050 వరకు ఉన్న అంచనాలను తెలియజేస్తోంది.

రాబోయే రోజుల్లో నీటి డిమాండ్‌ బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లలో..

2010  2025  2050
సాగునీరు  84.6% 83.3%  74.1% 
తాగునీరు  6.9% 6.7%  7.0%
పరిశ్రమలు 1.05% 2.1% 4.4%
ఎనర్జీ(విద్యుత్‌) 0.6% 1.4% 9.0%
ఇతర అవసరాలు 6.4% 6.5% 5.5%
ఈ లెక్కన.. దేశంలో నీటి సంక్షోభం వేగంగా ముంచుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. దేశంలో ఇప్పటికే.. తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు దర్శనిమిస్తున్నాయి. ఇప్పుడు మూడీస్‌ సర్వే రిపోర్ట్‌తో మరింత నీటి సంక్షోభం తప్పదన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. రాబోయే మరికొన్నేళ్లలో నీటి ఎద్దడి తీవ్ర భయంకరంగా మారడం ఖాయమనిపిస్తోంది. మొత్తంగా.. నీటి ఎద్దడిపై మూడీస్‌ రిపోర్ట్‌ కంగారు పుట్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు, సర్వే రిపోర్ట్‌ల నేపథ్యంలో ప్రభుత్వాలు నీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి..!