World Environment Day 2021: పర్యావరణ పరిరక్షణ అంశంపై బాలీవుడ్ చిన్నచూపు.. 32 ఏళ్లలో ఈ అంశంపై ఒక్కటే సినిమా!
World Environment Day 2021: ఈ రోజు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలంటే దానికి సినిమాని మించిన మాధ్యమం లేదు. మన దేశంలో సినిమా ప్రజలందరికీ అత్యంత ప్రీతి పాత్రమైన మీడియా.
World Environment Day 2021: ఈ రోజు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలంటే దానికి సినిమాని మించిన మాధ్యమం లేదు. మన దేశంలో సినిమా ప్రజలందరికీ అత్యంత ప్రీతి పాత్రమైన మీడియా. సినిమా తెరపై కనిపించిన ఎన్నో సన్నివేశాలు.. సినిమా నుంచి వినిపించిన ఎన్నో సందేశాలు బలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం మనకు తెలిసిందే. బాలీవుడ్ మనదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద చలనచిత్ర పరిశ్రమ. పర్యావరణ దినోత్సవానికి బాలీవుడ్ కి సంబంధం ఏమిటీ? అనుకోవద్దు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ దృష్టి సారించాల్సిన విషయం పర్యావారణం. ఎన్నో కారణాలతో మన పర్యావరణం పాడైపోతుంది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా ఉంది. అయితే, ప్రజల్లో ఈ విషయంలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత బలమైన సినిమా మీద కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే, సినిమా ద్వారా ఎక్కువ మంది ప్రజలకు సులువుగా సమస్యను.. దాని తీవ్రతనూ తీసుకుపోవచ్చు. ఇప్పడు పర్యావరణం పై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత సినిమా మీద కూడా ఉంది. కానీ, భారతదేశ సినిమాలో పర్యావరణ పరిరక్షణ కథాంశంతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఇంకా దేశంలో ప్రాంతీయంగా వస్తున్న సినిమాల్లో అడపాదడపా ఈ సమస్యను చర్చిస్తూ సినిమాలు వచ్చాయి. కానీ, బాలీవుడ్ నుంచి ఇప్పటివరకూ వేళ్ళమీద లెక్కించదగ్గ సినిమాలు మాత్రమె వచ్చాయనేది వాస్తవం.
నిజానికి గ్లోబల్ వార్మింగ్ పై నిర్మించిన చిత్రాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మనకు ‘ది డే ఆఫ్టర్ టుమారో’ వంటి హాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమ భారతదేశంలో ఉంది, కానీ గ్లోబల్ అప్పీల్ ఉన్న ఒక అంశంపై ఒక్క పెద్ద చిత్రం కూడా ఇక్కడ చేయలేదు. ఎందుకిలా?
కమర్షియాలిటీ వెనుక పరుగులు..
నిష్కర్షగా చెప్పాలంటే.. కమర్షియాలిటీ వెనుక పరుగులు తీయడమే తప్ప సమాజానికి పనికివచ్చే అంశాలపై బాలీవుడ్ ఫోకస్ చాలా తక్కువే. తీసిన కొన్ని సినిమాలూ ప్రజలను ఆకట్టుకోలేకపోవడంతో అటువంటి వాటి జోలికి వెళ్ళడానికి నిర్మాతలు సాహసించడం లేదు. కానీ, సామాజికాంశాన్ని కూడా కమర్షియల్ అంశాలతో ముడివేసి చెప్పిన ఎన్నో సినిమాలు విజయవంతం అయ్యాయి. ఆ కోవలో కూడా బాలీవుడ్ పర్యావరణ విషయంపై సరైన సినిమా తీయాలని భావించకపోవడం విచారకరమనే చెప్పాలి. 2018 లో వచ్చిన ‘కేదార్‌నాథ్’ సినిమా అలాంటి ప్రయత్నం చేసింది. ఈ సినిమా సారా అలీ ఖాన్ తొలి చిత్రం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరో. 2013 లో ఉత్తరాఖండ్‌లో జరిగిన విషాదం ఈ సినిమాలో తీసుకున్నారు. కానీ, దానికంటే ఎక్కువ ప్రేమకథ పైనే దృష్టి పెట్టడంతో ఇది ప్రేమకథా చిత్రంగానే మిగిలిపోయింది. ఇక 1989 నుండి భారతదేశ జాతీయ అవార్డులలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చిత్రాల విభాగంలో జాతీయ అవార్డు పొందిన ఏకైక చిత్రం ‘ఇరాడా’ . ప్రారంభంలో, ఈ అవార్డును అస్సాం నుంచి ‘బోనాని’ చిత్రం అందుకుంది, కానీ ఇప్పటి వరకు 32 సంవత్సరాలలో, 2017 లో ఒకసారి మాత్రమే హిందీ చిత్రం ‘ఇరాడా’ కి ఈ అవార్డు లభించింది. బాలీవుడ్ తో పోల్చితే, 6 మలయాళ చిత్రాలు మరియు 5 కన్నడ చిత్రాలు ఈ అవార్డును అందుకున్నాయి. అస్సామీ మరియు ఒరియాలో రెండు చిత్రాలు, మణిపురి, తమిళం, మరాఠీ మరియు అరుణాచల్ లలో ఒక్కొక్కటి ఈ అవార్డును అందుకున్నాయి.
అపర్ణ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఇరాడా’ పంజాబ్‌లోని బతిండాలోని థర్మల్ పవర్ ప్లాంట్లు మరియు కర్మాగారాల ద్వారా ప్రభావితమైన ప్రజల నిజమైన కథల ఆధారంగా రూపొందించారు. ఇప్పటివరకూ బాలీవుడ్ లో పర్యావరణం పై ప్రత్యేకంగా వచ్చిన సినిమాగా గుర్తుండిపోయే సినిమా ఇది ఒక్కటే. అదే ప్రాంతీయంగా చూసుకుంటే, కొంతవరకూ పర్యావరణం పై ప్రత్యెక సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రజలను ఆకట్టుకున్నాయి కూడా. ఒడిశా చిత్రనిర్మాత నీల్ మాధవ్ పాండా ‘ఐ యామ్ కలాం’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంతకు ముందు కూడా ఆయన ఇలాంటి సినిమాలు తీశారు. ‘కద్వి హవా’, ‘కాలిర్ అతీత్’ సినిమాలు పర్యావరణాన్ని గురించి వివరించినవే. ఈ విషయంపై పాండా మాట్లాడుతూ, ‘ప్రజలకు చెప్పడానికి మరియు ఒప్పించడానికి సినిమా అత్యంత శక్తివంతమైన మాధ్యమం. అందుకే పర్యావరణం గురించి మాట్లాడటానికి ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నాను.” అని చెప్పారు. ఆయన మాట నిజమే.. ఇలా పాండా లా ఆలోచించే దర్శకులు బాలీవుడ్ లో లేరనే చెప్పవచ్చు.
బాలీవుడ్ లో అలా వచ్చిన ఓ సినిమా ‘భోపాల్ ఎక్స్‌ప్రెస్’. ఈసినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అనుకుంటారు. కానీ, దీనికి మంచి లాభాలు వచ్చాయని నిర్మాత మహేష్ మిథాయ్ చెబుతారు. ఈ చిత్రం ప్రేక్షకులను భారీస్థాయిలో అలరించకపోవచ్చు, కానీ ఈ చిత్రంపై వారి ఆసక్తి అలాగే ఉంది. ఈ చిత్రం జర్మనీ మరియు ఫ్రెంచ్ టివి ఛానెల్స్, సినిమాహాళ్లలో విడుదలై అంతర్జాతీయ ఉత్సవాల్లో విజయవంతం అయినప్పుడు, ఇది వ్యయంతో పాటు లాభంలో కూడా తేడాను మాకు చూపించింది. ‘భోపాల్ ఎక్స్‌ప్రెస్’ 1999 లో విడుదలైంది. 1984 గ్యాస్ విషాదం ఆధారంగా ఈ చిత్రంలో కే కే మీనన్, నసీరుద్దీన్ షా, నేత్రా రంగనాథన్, జీనత్ అమన్ మరియు విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
మిథాయ్ ఇలా చెప్పారు.. ”నేటి యువత పర్యావరణ స్పృహతో ఉంది. ఇప్పుడు ఇలాంటి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమా విడుదలకు వేదికల కొరత లేదు. భోపాల్ గ్యాస్ విషాదంపై ‘1984’ పేరుతో వెబ్ సిరీస్ మేము నిర్మిస్తున్నాం.”
తమిళ సినీ విమర్శకుడు ఎన్ రమేష్ బాలా “భూమి”, “కత్తి”, “ఉరాయడి -2”, “కప్పాన్” వంటి పర్యావరణ చిత్రాలు తమిళ పరిశ్రమలో వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. ఇది సమస్యల ప్రశ్న కాదు. ఒక సినిమా ఎలా తీసారనేదే ప్రేక్షకులకు ముఖ్యం అంటున్నారు. అదేవిధంగా, పర్యావరణ కార్యకర్త సునీతా నారాయణ్ ప్రధాన స్రవంతి సినిమాపై కలత చెందారు. ‘సెలబ్రిటీలు ఏదైనా చదివి రాయాలి. దేశంలో ఏమి జరుగుతుందో, దాని పర్యవసానాలు ఏమిటో వారు తెలుసుకోవాలి.” అని ఆమె చెప్పారు.
ఏది ఏమైనా బాలీవుడ్ నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం మంచి సినిమాలు రావాల్సి ఉంది. ఎందుకంటే, సినిమా మాధ్యమం ప్రజల మనస్సులలో ప్రగాఢమైన ముద్ర వేస్తుంది. హాలీవుడ్ లో వచ్చిన అవతార్ లాంటి సినిమా బాలీవుడ్ లోనూ వస్తే బావుండునని పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడేవారంతా కోరుకుంటున్నారు. ఇది అత్యాశ కాదు కదా!
Also Read: Venkaiah Naidu : ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని వెంకయ్య నాయుడు పిలుపు
World Environment Day: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మొక్కలు పెంచుదాం, భూమిని కాపాడుకుందాం!