AP DGP : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలోని గర్భిణీ మహిళా సిబ్బందికి ఏపీ డీజీపీ బంపారాఫర్ ఇచ్చారు. వారంతా ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్ అధికారులకు డీజీపీ గౌతం సవాంగ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. “పోలీస్ శాఖ లోని గర్భిణీ మహిళా సిబ్బందిని ఇంటి నుండి పని చేయడానికి (Work From Home)అనుమతించాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఆదేశాలను తక్షణమే అమలు చేయడంతో పాటు గర్భిణీ మహిళా సిబ్బంది ఆరోగ్యం, ప్రత్యేక వైద్య సదుపాయాల అవసరాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వారి యోగక్షేమాలను క్రమం తప్పకుండ పర్యవేక్షించడంతోపాటు.. యూనిట్ల వారీగా గర్భిణీ మహిళా సిబ్బంది పూర్తి వివరాలను మంగళగిరి లోని చీఫ్ ఆఫీసుకు తెలియజేయాలి” అని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, గర్భిణీ మహిళా పోలీస్ ల ఆరోగ్య పరిస్థితుల పైన డీజీ కంట్రోల్ కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు.