పర్యావరణం బాగుంటేనే జీవకోటి మనుగడ ఉంటుంది.. జీవవైవిధ్యంతోనే జీవరాశుల మనుగడ.. ఇలా పేనవేసుకున్న విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటికి అవసరమైన ప్రాణవాయువు, ఆహారం, నీరు అందిస్తుంది. వాస్తవానికి ప్రకృతితో పక్షులు ఎక్కువగా మమకమై ఉంటాయి.. అందుకే.. వీటిని పర్యావరణ జీవరాశులు అంటారు.. పక్షులు జీవవైవిధ్యానికి సూచికలు.. ఎందుకంటే అవి ప్రపంచ జీవ వైవిధ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. ప్రపంచంలోని 10,000 పక్షి జాతులలో దాదాపు సగం అడవులు, చిత్తడి నేలలు.. గడ్డి భూములపై ఆధారపడి జీవిస్తున్నాయి.. అందుకే.. ప్రపంచంలోని అన్ని పర్యావరణ వ్యవస్థల నివాసులుగా పక్షుజాతులను పేర్కొంటారు. విస్తృత జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల కోసం వాటిని కొన్ని ఉత్తమ సూచికలుగా చెప్పవచ్చు..
భూమిపై ప్రకృతి తల్లి సృష్టించిన అపారమైన వైవిధ్యానికి పక్షి జాతులు అద్భుతమైన ఉదాహరణ అని.. అవి పర్యావరణ వ్యవస్థను కాపాడుతాయని ఇప్పటికే.. ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే.. ప్రస్తుత ఆధునిక యుగంలో పక్షులు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.. అడవలను నరకడం, పారిశ్రామిక విప్లవం.. ఆధునిక టెక్నాలజీ.. విధ్వసం, ప్రకృతి వైపరిత్యాలు.. ఇలా భూవిపై జరిగే అనేక రకాల కారణాల వల్ల చాలా వరకు పక్షి జాతులు అంతరించిపోయాయి.. మరికొన్ని అంతరిస్తున్నాయి. ముఖ్యంగా వాటి నివాస ప్రాంతాలను భంగం కలిగించడం వల్ల పక్షుల సంరక్షణపై ప్రభావం చూపుతుందని.. వాటి మనుగడతోనే జీవవైవిధ్యం సాధ్యమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు..
వాస్తవానికి పక్షులు కాలానుగుణంగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి.. వాటికి అనువైన ప్రదేశాలకు వలస వెళ్లడం అనేది సహజం.. కాలానుగుణంగా వచ్చే వలస పక్షులను ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అతిథుల్లా చూస్తారు.. కానీ.. ఆ దేశం మాత్రం పక్షులపై పగబట్టింది.. ప్రకృతికి ప్రతీక అయిన పక్షులను ఓ దేశం మట్టుబెడుతోంది.. వేటాడి మరి కాల్చి చంపుతోంది.. భారత్ నుంచి వలస వెళ్లిన కాకులపై కెన్యా దేశం ఏకంగా దండయాత్రనే మొదలుపెట్టింది. 10 లక్షల భారతీయ కాకులను చంపాలని ప్లాన్ చేసింది. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వచ్చి.. తమ దేశ పర్యావరణం, పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయంటూ కెన్యా ప్రభుత్వం కాకులపై యుద్ధం మొదలుపెట్టింది. దేశంలో కాకి అరుపులే లేకుండా చేయాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ విఫలమవుతున్న కెన్యా ప్రభుత్వం… ఈ సారి పకడ్భందీగా ప్లాన్ చేసింది. సుమారు 10 లక్షల కాకులను అంతమొందించేందుకు పథకం ప్రకారం ముందుకెళ్తోంది. విస్తృత జీవవైవిధ్యానికి సూచికలైన కాకులను కెన్యా దేశం కాల్చి చంపుతుండటంపై ప్రకృతి ప్రేమికులు.. శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని పాడుచేస్తున్నా నెపంతో వాటిపై కెన్యా ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది.
భారతదేశం నుంచి వలస వెళ్లిన కాకుల సంఖ్య కెన్యాలో క్రమంగా పెరిగిపోయింది. దీంతో కెన్యాలో ఎక్కడ చూసినా కాకులే కనిపిస్తుండటం, అవి మరింత దూకుడుగా వ్యవహరిచడంతో కెన్యా ప్రజలు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాకులు.. ఆహారాన్ని దొంగలించడం, పంట నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడటం వంటి చాలా కారణాలతో అసలు కాకులే లేకుండా చేయాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కాకులను వేటాడుతోంది.
కాకుల బెడద పెరగడంతో.. కెన్యాలోని ప్రజలే కాదు పెద్దపెద్ద వ్యాపారవేత్తలు సైతం కాకులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తాము నెలకొల్పిన పరిశ్రమలను కాకులు దెబ్బ తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా తమ వ్యాపార ప్రాంగణంలోకి వచ్చి తయారుచేసిన వస్తులను సర్వనాశనం చేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు..
అయితే.. పర్యావరణ ప్రేమికులు సైతం కాకులను చంపే ప్రతిపాదనను సమర్థిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కెన్యాలోని పర్యావరణ ప్రేమికులు కాకులు లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ కాకులతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటోందంటున్నారు. భారత కాకుల కారణంగా కెన్యాలోని సముద్ర ప్రాంతాల్లో ఉండే చిన్న, స్థానిక పక్షి జాతుల సంఖ్య బాగా తగ్గిపోయిందంటున్నారు. దీంతో పాటు కాకులు… పక్షల గూళ్లు, వాటి గుడ్లు, పిల్లలను తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకులు లేకుంటేనే కెన్యాలో కీటకాలు, ఇతర చిన్న జీవులు సమృద్ధిగా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఎరోచా కెన్యా ప్రకారం.. వాస్తవానికి భారతదేశం నుంచి వలస వెళ్లిన కాకులు ఆసియాలోని ఇతర ప్రాంతాలలో భారీగా పెరిగిపోయాయి.. కార్వస్ స్ప్లెండెన్స్ అనే ఆక్రమణ జాతులను మొదట చెత్తను నియంత్రించడానికి 1890లలో మొదటిసారిగా జాంజిబార్‌లో ప్రవేశపెట్టారు.. 1917 నాటికి అవి తూర్పు ఆఫ్రికాలో తెగుళ్లుగా పరిగణించాయి.. కాకులు క్రమంగా లక్షల సంఖ్యలో రూపాంతరం చెందగా… చనిపోయిన కాకి లేదా కాకి గుడ్డును తీసుకువచ్చిన వారికి బహుమానం ఇస్తాం అనేంత వరకు కెన్యా వెల్లింది.. ఒక శతాబ్దం తర్వాత కాకులు భారీగా పెరిగి.. స్థానిక వన్యప్రాణులను చంపడం.. పర్యాటకుల బఫేలలో ఆహారం తినడం, పౌల్ట్రీ ఫారమ్‌లలో కోడిపిల్లలపై దాడి చేయడం.. విమాన సర్వీసులకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దీంతో కాకులను అంతంచేసేందుకు కెన్యా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రచించింది.. దేశంలోని హోటళ్ల వ్యాపారులు కాకులను చంపేందుకు లైసెన్స్ పొందిన విషాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది.. కొందరు ఇప్పటికే లార్సెన్ ట్రాప్‌లను ఉపయోగించడం ప్రారంభించారు (ఒక పంజరం లాంటి పరికరం పక్షులను డెకోయ్ సహాయంతో లైవ్-ట్రాప్ చేయడానికి). మరికొందరు కాకులు దూరంగా ఉండేందుకు కాటాపుల్ట్‌లతో సిబ్బందిని నియమించుకున్నారు.
కెన్యా తీరప్రాంత పట్టణమైన మొంబాసా, చెత్త సంక్షోభం కారణంగా ఇండియన్ కాకులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. 1947లో నౌకల ద్వారా లేదా పొరుగున ఉన్న జాంజిబార్ నుంచి కాకులు మొంబాసాలోకి ప్రవేశించాయని చెబుతారు.. ఈ పక్షులు 700 కి.మీ లోపలికి మరీగట్ వంటి పట్టణాలకు కూడా వలస వెళ్లింది. ఇవి బబ్లర్లు, సన్‌బర్డ్స్ వంటి స్థానిక జాతుల పక్షులను భయభ్రాంతులకు గురిచేయడం దాడులు చేయడం ద్వారా కీటకాల విస్తరణకు సహాయపడుతుంది.దీంతో పాటు ఇళ్లల్లోకి కూడా చొరబడి ఆహారం తినడం, సముద్ర జీవులను వెంటాడటం లాంటివిచేసి ఎన్నో స్థానిక జీవులను అంతరించేలా చేశాయని చెబుతున్నారు. చివరకు.. కాకుల గోల భరించలేక.. కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్, హాస్పిటాలిటీ పరిశ్రమ ప్రతినిధులు, పశువైద్యులు, ఎ రోచాతో ఇటీవల జరిగిన సమావేశంలో ఒక కార్యాచరణ ప్రణాళికను చర్చించారు.
కెన్యా తీరం వెంబడి కాకుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అవి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్.. జిబౌటి మరియు కైరో వరకు కనిపించాయి.. అని అధికార ప్రతినిధి కినోటి చెప్పారు. పక్షి నైరోబీలోకి ప్రవేశిస్తుందని భయం కలుగుతుందన్నారు.. “మేము వాటిని నైరోబీకి చేరుకోనివ్వలేము, ఎందుకంటే అవి నైరోబి నేషనల్ పార్క్ వద్ద స్థానిక జంతుజాలానికి గొప్ప సమస్యను కలిగిస్తాయి.” దీంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
అశాస్త్రీయ దుందుడుకు చర్యలతో అనర్థమే..
ఇలా కాకులపై ఫైట్ మొదలుపెట్టిన కెన్యా ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. ఇబ్బంది పెడుతున్నాయని అశాస్త్రీయ కారణాలతో కాకులను చంపితే అవి భవిష్యత్తులో కనిపించకుండాపోయే ప్రమాదం ఉందంటున్నారు. కాకులు అంతరించిపోవడం ద్వారా జీవ వైవిధ్యానికి మరో రకంగా ముప్పు వాటిళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇది ఆ దేశంలో ఇతర జీవరాశుల మనుగడపై ప్రభావాన్ని చూపి వాతావరణ మార్పులు చూపొచ్చని, నదులు ఎండిపోయి కరువు కాటకాలకు కారణం కావొచ్చని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జీవ వైవిధ్యం దెబ్బతింటే మాన మనుగడకు ముప్పే..
జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. జీవుల మనుగడకు కారణమైన పుడమి తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే జీవ వైవిధ్యం సరిగ్గా ఉండాల్సిందే. జీవుల మధ్య ఆహార గొలుసు దెబ్బతింటే కొన్ని జీవరాశుల మనుగడే ప్రశ్నార్థకమయ్యే అవకాశముంది. అంతిమంగా ఆహారోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపి మనిషి మనుగడకే ముప్పు వాటిళ్లే అవకాశముంది. జీవ వైవిధ్య రక్ష కోసం దేశ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఉద్యమలా నడిచాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 వేల జాతులు లేదా రోజుకు 27 జీవరాశులు అంతరించిపోతున్నాయని అంచనా. వృక్ష, జంతు, పక్షిజాతులు అంతరించిపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడినట్టే. మిడతల దండు వలసలతో పశ్చిమ భారత్‌లోని పలు రాష్ట్రాల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడం మనకు తెలిసిందే. ఓ రకంగా కాకుల కారణంగా కెన్యా కూడా ఇప్పుడు అదే రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించాలంటే కెన్యాలో ఒక్కటంటే ఒక్క కాకి కూడా ఉండకూడదని టార్గెట్‌గా పెట్టుకోవడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ప్రీమియం ఆర్టికల్స్ చదవండి..