
రెండో ప్రపంచ యుద్ధ ముగింపు దశలో.. ప్రపంచ చరిత్రనే మార్చివేసిన ఆ విషాద సంఘటన జరిగి నేటికి ఎనిమిది దశాబ్దాలకు పైగా అవుతోంది. 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా వేసిన లిటిల్ బాయ్ అనే అణుబాంబు కొన్ని సెకన్లలోనే వేలాది ప్రాణాలను బూడిద చేసింది. ఆ తర్వాత మూడు రోజులకే.. అంటే ఆగస్టు 9న నాగసాకిపై మరో అణుబాంబు పడింది. అసలు అమెరికా జపాన్‌పైకి ఈ అణుబాంబును ఎందుకు విసిరింది? ఈ నిర్ణయం వెనుక ఉన్న సైనిక, రాజకీయ మరియు చారిత్రక కారణాలు ఏంటి? అనేది ఇప్పటికీ తీవ్ర చర్చనీయాంశంగానే ఉంది.
అణుబాంబు దాడి వెనుక అమెరికా చెప్పిన ప్రధాన కారణం యుద్ధాన్ని త్వరగా ముగించడం. ఆ సమయంలో జపాన్ సైన్యం లొంగిపోవడానికి అస్సలు సిద్ధంగా లేదు. జపాన్ భూభాగంలోకి నేరుగా ప్రవేశించి యుద్ధం చేయాల్సి వస్తే లక్షలాది మంది అమెరికన్ సైనికులు, లక్షలాది మంది జపనీయులు ప్రాణాలు కోల్పోతారని అమెరికా అంచనా వేసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్, యుద్ధాన్ని తక్షణమే ముగించి తన దేశ సైనికుల ప్రాణాలను కాపాడేందుకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
1941 డిసెంబర్ 7న జపాన్ వైమానిక దళం హవాయిలోని అమెరికా నావికా స్థావరం పెర్ల్ హార్బర్‌పై హఠాత్తుగా దాడి చేసి వేలాది మంది అమెరికన్లను పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనతోనే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి నేరుగా అడుగుపెట్టింది. హిరోషిమాపై అణుబాంబు వేయడం వెనుక పెర్ల్ హార్బర్ దాడికి ప్రతీకారం తీర్చుకునే కోణం కూడా ఉందనేది చరిత్రకారుల విశ్లేషణ.
హిరోషిమా దాడి వెనుక అంతర్జాతీయ రాజకీయం కూడా దాగి ఉందనే వాదన బలంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి అప్పటి సోవియట్ యూనియన్ తీవ్ర ప్రభావ శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచంలో అమెరికానే అత్యంత శక్తివంతమైన దేశమని, తమ వద్ద తిరుగులేని ఆయుధ సంపత్తి ఉందనే సందేశాన్ని సోవియట్ యూనియన్‌కు పంపడానికే అమెరికా ఈ న్యూక్లియర్ పవర్‌ను ప్రదర్శించిందని విశ్లేషకులు భావిస్తారు. ఇది భవిష్యత్తులో రాబోయే ప్రచ్ఛన్న యుద్ధానికి పునాది వేసింది.
హిరోషిమాపై బాంబు పడిన క్షణంలోనే సుమారు 70,000 నుండి 80,000 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అణు విస్ఫోటనం వల్ల వెలువడిన ప్రమాదకర రేడియేషన్ ప్రభావంతో ఆ తర్వాత కొద్ది నెలల్లోనే మరణాల సంఖ్య 1,400,000 కు చేరింది. రేడియేషన్ ప్రభావం వల్ల పుట్టబోయే తరాలు కూడా క్యాన్సర్, ఇతర తీవ్రమైన శారీరక వైకల్యాలతో జన్మించాయి.
హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులు ప్రపంచానికి ఒక తీవ్రమైన హెచ్చరికను అందించాయి. అణు ఆయుధాలు ఎంతటి వినాశనానికి దారితీస్తాయో కళ్లకట్టినట్లు చూపించాయి. ఈ ఘటనల తర్వాత జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటికీ, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల పోటీ పెరిగింది. హిరోషిమా విషాదం నేటికీ ప్రపంచ దేశాలకు శాంతి, అణ్వాయుధ రహిత ప్రపంచం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తూనే ఉంది.