Putin Fitness Secret: రష్యా అధ్యక్షుడి రూల్.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పక్షి గుడ్లు ఉండాల్సిందేనట!

ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చూస్తే, ఆయన వయసు 73 ఏళ్లయినా, చూసేందుకు దృఢంగా, యవ్వనంగా కనిపిస్తారు. మాజీ కేజీబీ ఏజెంట్ అయిన పుతిన్, ఈ వయసులో కూడా అంత చురుకుగా, ఫిట్‌గా ఉండటానికి కారణం... ఆహారం, వ్యాయామం విషయంలో ఆయన ఏమాత్రం రాజీపడకపోవడమే. ఆయన డైట్ లో ఇవి తప్పక ఉండాల్సిందేనట..

Putin Fitness Secret: రష్యా అధ్యక్షుడి రూల్.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పక్షి గుడ్లు ఉండాల్సిందేనట!
Putin Fitness

Updated on: Dec 05, 2025 | 9:11 PM

ఆయన దినచర్య, ఆహారపు అలవాట్లు చాలా రహస్యంగా ఉంటాయి. దాదాపు ఐదేళ్ల క్రితం, బ్రిటిష్ జర్నలిస్ట్ బెన్ జుడా మూడు సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, అనేక ఇంటర్వ్యూల తర్వాత ఈ వివరాలను ప్రపంచానికి వెల్లడించారు. ఆసక్తికరమైన పుతిన్ అల్పాహారం, జీవనశైలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం ఆలస్యంగా… కౌజు పిట్ట గుడ్లు తప్పనిసరి!

శక్తి, పోషకాలతో కూడిన ఆహారానికి పుతిన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆయన రోజువారీ ఆహారంలో కచ్చితంగా గుడ్లు ఉంటాయి. అయితే, అవి సాధారణ కోడి గుడ్లు కావు. ఆయన సొంతంగా పెంచిన కౌజు పిట్ట గుడ్లు (Quail Eggs) మాత్రమే తీసుకుంటారు. అప్పుడప్పుడు బాతు గుడ్లను కూడా తింటారు.

కౌజు గుడ్లలో ఏముంది?

కౌజు పిట్ట గుడ్లలో విటమిన్ B12 సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా B12 అధికంగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

దాదాపు 100 గ్రాముల కౌజు గుడ్లు రోజువారీ B12 అవసరంలో 66% వరకు అందిస్తాయి.

ప్రోటీన్, ఐరన్, ఫోలేట్, కోలిన్, విటమిన్ A, సెలీనియం వంటివి కూడా వీటిలో సమృద్ధిగా లభిస్తాయి.

అలర్జీలకు విరుగుడు: ఈ గుడ్లు కణాల డ్యామేజ్ నుండి రక్షించడంలో, అలాగే తుమ్ములు, ముక్కు కారడం వంటి అలర్జీ సమస్యలను నివారించడంలో సహాయపడతాయని హెల్త్‌లైన్ నివేదికలు చెబుతున్నాయి.

పుతిన్ రోజువారీ ఆహార మెనూ:

దినచర్య ప్రారంభం: ఆయన దినచర్య తేనె కలిపిన ట్వోరాగ్ (Tvorog – రష్యన్ కాటేజ్ చీజ్) తో మొదలవుతుంది.

అల్పాహారం: ఆలస్యంగా తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో పచ్చిగా లేదా ఉడకబెట్టిన కౌజు గుడ్లు, లేదా ఆమ్లెట్/వోట్స్ తింటారు. ఆ తర్వాత తాజా పండ్ల రసం, చివరిగా ఒక కప్పు కాఫీ తాగుతారు.

భోజనం/విందు: మధ్యాహ్నం, రాత్రి భోజనంలో చేపలు తప్పనిసరి. పొగబెట్టిన (Smoked) వంటకాలంటే ఆయనకు చాలా ఇష్టం. రెడ్ మీట్ కూడా ఆయన మెనూలో ఉంటుంది.

సలాడ్: టమాటా, దోసకాయ వంటి సాధారణ కూరగాయలతో చేసిన సలాడ్‌లను ఎక్కువగా తీసుకుంటారు.

మద్యం, జంక్ ఫుడ్ దూరం: పుతిన్ మద్యానికి పూర్తిగా దూరం. అధికంగా బేక్ చేసిన ఆహారాలు, షుగర్ డెజర్ట్‌లు, చీజ్‌తో చేసిన పేస్ట్రీలను అస్సలు ఇష్టపడరు.

డెజర్ట్: ఆయనకు ఇష్టమైన డెజర్ట్ పిస్తా ఐస్ క్రీం మాత్రమే.

ఆహార నియమం, ఫిట్‌నెస్:

అల్పాహారం తీసుకున్న వెంటనే పుతిన్ వ్యాయామం చేస్తారు. ఇందులో ఈత కొట్టడం (Swimming), బరువులు ఎత్తడం (Weightlifting) వంటివి ఉంటాయి. రుచి కంటే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ, చాలా సాధారణమైన ఆహారాన్ని తీసుకుంటారు.

విదేశీ పర్యటనల్లో కఠిన నియమాలు:

పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన ఆహార నియమాలు మరింత కఠినంగా మారుతాయి. హోటల్ సిబ్బంది తయారుచేసిన ఆహారాన్ని ఆయన చాలా అరుదుగా తింటారు.

ఆయనతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన రష్యన్ చెఫ్‌లు, సహాయక సిబ్బంది ఉంటారు.

విశేషమేమిటంటే, ఆయన వెంట ‘మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్’ను కూడా తీసుకువెళ్తారని చెబుతారు.

ఆహారాన్ని పూర్తిగా సురక్షితమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన వంటగదిలోనే తయారు చేస్తారు. దీనికోసం ప్రత్యక్షంగా తెచ్చిన లేదా ముందుగానే పూర్తిగా తనిఖీ చేసిన పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తారు.