
పూర్వం నుంచి వంటగదికి సంబంధించి కొన్ని నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా వంటగదిలో రాత్రి భోజనం తర్వాత ఎంగిలి పాత్రలను అలాగే ఉంచడం అపశకునమని మన పెద్దలు తరచూగా చెబుతుంటారు. అది ఇంటికి ధననష్టాన్ని తెస్తుందని హెచ్చరిస్తుంటారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మురికి పాత్రలు ఎక్కువసేపు అలాగే ఉంటే వాటిలో బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇలా జరిగితే వంటగది వాతావరణం కలుషితమవుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల పాత్రలను వెంటనే శుభ్రం చేయడం ద్వారా ఆరోగ్యం రక్షించబడటమే కాకుండా ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంటుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాత్రిపూట పాత్రలు కడగకపోవడం వల్ల కుటుంబ సభ్యులు రాహు-కేతువుతో సహా అనేక గ్రహాల దుష్ప్రభావాలను ఎదుర్కొంటారు. ఏదైనా కారణం చేత మీరు రాత్రిపూట పాత్రలను కడగలేకపోతే, పాత్రలను నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. దాంతో పాటుగా నీటిని వృధా చేయడం కూడా వంటగది వాస్తులో తప్పు అని చెబుతారు. నీరు విలువైన వనరు. పెద్దలు నీటిని వదిలేయకూడదని, వాస్తు దృష్టిలో ఇది ఆర్థిక నష్టానికి సూచనగా చెబుతారు.
కొందరు వంటగదిలో మందులు ఉంచడం కూడా తప్పు అని అంటారు. వాస్తు ప్రకారం ఇది శుభం కాదని చెబుతారు. అయితే, దీని వెనుక మరో శాస్త్రీ కారణం కూడా ఉంది.. వంటగదిలో ఉష్ణోగ్రత ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఇలాంటి వేడి పరిస్థితుల్లో మందుల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అదనంగా ఆహారం దగ్గర మందులు ఉంచితే అపరిశుభ్రత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.
అలాగే, వంటగదిలో విరిగిన పాత్రలను ఉంచటం కూడా పొరపాటు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, విరిగిన పాత్రలను వంటగదిలో ఉంచడం వల్ల ఇంట్లో గొడవలు, తగాదాలు తలెత్తుతాయని నమ్మకం. ఇంకా, విరిగిన పాత్రలలో ఆహారం తినకూడదని కూడా చెబుతారు. అయితే వాస్తవానికి విరిగిన పాత్రలు వాడటం ప్రమాదకరం. వాటి అంచులు తగిలి చేతికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఇవి వంటగదిని అస్తవ్యస్తంగా చూపిస్తాయి.
చెత్త లేదా శుభ్రం చేసే పరికరాలు వంట ప్రాంతానికి దూరంగా ఉంచాలి. లేదంటే, మీ వంటిళ్లు, ఆహార పదార్థాల పరిశుభ్రత దెబ్బతింటుంది. గ్యాస్ స్టవ్ పక్కన చెత్తబుట్ట ఉంటే దుర్వాసనతో పాటు గాలి కాలుష్యం పెరిగి వంట వాతావరణం అసౌకర్యంగా మారుతుంది. పరిశుభ్రత కోసమే ఈ నిషేధం పాటించాల్సి వస్తుంది.
గమనిక: ఈ కంటెంట్ నమ్మకాలు, సమాచారం ఆధారంగా అందించింది. ఇది కచ్చితమైనదని హామీ ఇవ్వబడదు. ఎప్పుడైనా, దయచేసి సంబంధిత నిపుణుడిని (జ్యోతిష్యుడు) సంప్రదించండి.