ఆస్తి లాక్కుని కసాయి కొడుకులు వదిలేశారు.. తలకొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకున్న కూతుళ్లు!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల ఉదంతం మాత్రమే కాదు, బాధ్యతను విస్మరించిన కొడుకులకు గుణపాఠం. పితృస్వామ్య భావజాలంపై ఆడబిడ్డల విజయం.

ఆస్తి లాక్కుని కసాయి కొడుకులు వదిలేశారు.. తలకొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకున్న కూతుళ్లు!
Daughters Perform Mother Funeral Rites

Updated on: May 02, 2026 | 8:06 AM

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల ఉదంతం మాత్రమే కాదు, బాధ్యతను విస్మరించిన కొడుకులకు గుణపాఠం. పితృస్వామ్య భావజాలంపై ఆడబిడ్డల విజయం.

హాపుర్ జిల్లా లాల్‌పూర్ గ్రామంలో 85 ఏళ్ల హర్నంది దేవి జీవితం ఒక పోరాటం. 1987లో ఆమె భర్త భారత వైమానిక దళ ఉద్యోగిగా విధులు నిర్వహించి మరణించారు. ఆ తర్వాత, ఒంటరిగా ఆరుగురు పిల్లలను.. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లను కష్టపడి పెంచి పెద్ద చేసింది. అయితే, ఆమె ఆశీస్సులు పొంది పెరిగిన కొడుకులు మాత్రం కనికరం లేనివారిగా మారారు. తల్లికి ఉన్న వ్యవసాయ భూమిని మోసపూరితంగా తమ పేర్ల మీదకు బదిలీ చేసుకున్నారు. వృద్ధాప్యంలో ఆమెను నిస్సహాయురాలిని చేసి ఇంటి నుండి గెంటివేశారు. ఆ క్లిష్ట సమయంలో ఆమెకు అండగా నిలబడింది ఆమె పెంచిన కూతుళ్లు విమ్లేష్, షగున్ మాత్రమే.

కొడుకుల ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన హర్నంది దేవి, తన వీలునామాలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం అంత్యక్రియల బాధ్యతను కొడుకులకు కాకుండా, తనను చివరి వరకు చూసుకున్న కూతుళ్లకే అప్పగించాలని కోరారు. ఏప్రిల్ 17న అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆమె, తొమ్మిది రోజుల పోరాటం తర్వాత బుధవారం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్త తెలిసినా కొడుకులు కనీసం ముఖం చూడటానికి రాలేదు. దీంతో విమ్లేష్, షగున్ స్వయంగా తల్లి శవపేటికను భుజాన మోసి స్మశానానికి తీసుకెళ్లారు. సమాజంలో మహిళలు స్మశానానికి వెళ్లకూడదనే పాత ఆచారాలను కాదని, తలకొరివి పెట్టి తమ తల్లి చివరి కోరికను నెరవేర్చారు.

ఈ సంఘటన సమాజానికి ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తోంది. రక్తసంబంధం అంటే కేవలం వారసత్వం కాదు, బాధ్యత అని నిరూపించారు ఆ సోదరీమణులు. ఆస్తి కోసం తల్లిని మోసం చేసిన కొడుకులు ఉన్న ఈ లోకంలో, ఆడపిల్లలు తలకొరివి పెట్టి అమ్మ గౌరవాన్ని నిలబెట్టడం ఒక చారిత్రాత్మక మార్పుకు సంకేతం. లాల్‌పూర్ గ్రామస్తులు సైతం ఆ కుమార్తెల ధైర్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us