అట్లాంటిక్ మహా సముద్రంలో 111 ఏళ్ల కిందట ఓ మహా విషాదం జరిగింది. ప్రపంచమంతా అబ్బురపడేలా తయారు చేసిన టైటానిక్ షిప్ వేల మందిని బలి తీసుకుంది. ఈ విషాదాంత కథను జేమ్స్ కామెరూన్ ‘టైటానిక్’పేర మువీ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఈ మువీలో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓడ ప్రమాదానికి గురై ఎలా సముద్రగర్భంలో కలిసిపోయిందో భావోద్వేగభరితంగా చూపించారాయన. సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉండిపోయిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన తెరకెక్కించాడు. అయితే తాజాగా టైటానిక్ మువీలో ఉపయోగించిన వస్తుసామాజాగ్రి, దుస్తులు వంటి వాటిని ఆన్‌లైన్ వేలం పాటకు ఉంచిన సంగతి తెలిసిందే.
అయితే నిజ జీవితంలో ఏప్రిల్ 11, 1912న అట్లాంటిక్‌లో నీట మునిగిన టైటానిక్ షిప్‌కు సంబంధించిన ఫస్ట్ క్లాస్ డిన్నర్ మెనూ కూడా వేలం పాటకు వచ్చింది. దాని ధర ఏకంగా 60 వేల డాలర్లు అంటే రూ. 61,18,260 ధర పలికింది. సముద్రం నీళ్లలో తడిసిన ఈ ప్రత్యేక కళాఖండం.. ఓడ నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు ప్రయాణీకులు ఆరగించడానికి సిద్ధం చేసిన విలాసవంతమైన భోజనాల మెనూ. టైటానిక్ బాధితుల్లో ఒకరి వద్ద నుంచి దీనిని సేకరించారు. నాటి విషాదానికి గుర్తుగా లెన్ స్టీఫెన్‌సన్ అనే టైటానిక్ బాధితుడు దాచుకున్న వ్యక్తిగత వస్తువుల నుంచి ఈ డిన్నర్ మెనూను సేకరించారు. స్టీఫెన్‌సన్ 2017లో మరణించారు. అతని కుమార్తె మేరీ అనిత తన తండ్రి దాచుకున్న వస్తువుల్లో టైటానిక్ మెనూను కనుగొంది. దానిని వేలం నిర్వాహకులకు అందించింది.
ఈ ప్రత్యేక మెనూ గురించి తమకు ఇంతకు ముందు తెలియదని వేలం నిర్వాహకులు హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ లిమిటెడ్ వెల్లడించింది. బిలియనీర్లు జేజే ఆస్టర్, బెంజమిన్ గుగ్గెన్‌హీమ్, సర్ కాస్మో డఫ్-గోర్డాన్, ‘అన్‌సింకేబుల్’ మోలీ బ్రౌన్‌లకు అందించిన వంటకాలు ఈ మెనూలో ఉన్నాయి. వంటలలో ఓస్టెర్, స్క్వాబ్ ఎ లా గొడ్దార్డ్, స్ప్రింగ్ లాంబ్, టోర్నడో ఆఫ్ బీఫ్ ఎ లా విక్టోరియా, మల్లార్డ్ డక్, ఆప్రికాట్ బోర్డెల్లో వంటి తదితర ఆహారాలు ఉన్నాయి. ఇది టైటానిక్ ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్‌లోని మెనూ అని వేలం నిర్వాహకుడు ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ మీడియాకు తెలిపారు. అయితే ఇది నిజమైనదా..కాదా అని తాను తనిఖీ చేశాడని, పాత ఫోటో ఆల్బమ్‌లో ఈ మెనూని కనుగొన్నట్లు తెలిపారు. దీంతో అది నిజమైనదేనని నిర్ధారించారు. కాగా టైటానిక్ మెనుల్లోని కొన్ని ఆహారాలు నేటికీ అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 11న (విపత్తు జరిగిన) రాత్రి స్టీఫెన్‌సన్ ధరించిన కోటు జేబుల్లో ఉండి ఉంటుందని వారు భావించారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ కథనాల కోసం క్లిక్ చేయండి.