వర్షాకాలంలో కొన్నిసార్లు మనం ధరించే దుస్తులపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మరకలు బూజు, ఫంగస్ వల్ల ఏర్పడతాయి. ఫంగస్ వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతుంది. వర్షాకాలం దీని పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. డార్క్ స్పాట్స్ ఉన్న బట్టలు ధరించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఇవి దుస్తుల రూపాన్ని పాడుచేయడమే కాకుండా అసహ్యకరమైన దుర్వాసన వెదజల్లుతుంది.
1. ఫంగస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మిగిలిన లాండ్రీ నుండి ప్రభావితమైన దుస్తులను వేరు చేయాలి. వెనిగర్, నీరు, నిమ్మరసం మిశ్రమాలను సమాన భాగాలుగా తీసుకుని దాంతో సున్నితంగా స్క్రబ్ చేయాలి. తద్వారా మరకలు తొలగిపోతాయి. డ్రెస్‌లను వాష్ చేసే ముందు ఈ మిశ్రమాన్ని మచ్చలపై 10-15 నిమిషాలు ఉంచాలి.
2. నాణ్యమైన డిటర్జెంట్ ఉపయోగించి బట్టలు ఉతకాలి. వాషింగ్ మెషీన్‌లో వేస్తే ఒక కప్పు వెనిగర్ కలపాలి. వెనిగర్ ఫంగస్‌ను చంపడానికి, దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.
3. సూర్యరశ్మి సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. నేరుగా సూర్యకాంతిలో బట్టలు ఆరబెట్టాలి. ఇది ఫంగస్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.
4. డ్రెస్సుల తేమను తగ్గించడానికి నిల్వ ప్రదేశంలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. తడి బట్టలు ఎక్కువగా నిల్వ ఉంచొద్దు.
5. అల్మారాలు, డ్రెస్సులు నిల్వ చేసే ప్రదేశాలలో సిలికా జెల్ ప్యాకెట్లు, నాఫ్తలీన్ బాల్స్ వంటి తేమ-శోషక ఉత్పత్తులను ఉంచాలి.
6. ఇప్పటికే ఉన్న ఫంగస్‌ను తొలగించడానికి అల్మారాలను క్రమం తప్పకుండా చెక్ చేయడం, శుభ్రం చేయడం వంటివి చేయాలి.
7. డార్క్ స్పాట్స్ తగ్గడానికి బట్టలను బాగా ఆరబెట్టాలి. గాలికి వేయాలి. వాటిని శుభ్రమైన, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమ-శోషక ఉత్పత్తులను ఉపయోగించడాన్ని పరిగణించండి. బూజు కనిపించినట్లయితే.. వెనిగర్, నిమ్మరసం ఉపయోగించి క్లీన్ చేయాలి. ఆపై సూర్యకాంతికి ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో మీ దుస్తులు శుభ్రంగా ఉంటాయి.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..