
బయట క్రిస్పీగా.. లోపల జ్యుసీగా ఉండే చికెన్ 65 అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? సాధారణ చికెన్ కర్రీకి, దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అసలు ఈ వంటకం ఎలా పుట్టింది? చెన్నైలోని ఒక ప్రసిద్ధ హోటల్ దీనికి ఆ పేరు ఎందుకు పెట్టింది? ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ దేశీ వంటకం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..
పేరు వెనుక చరిత్ర:
చాలా మంది చికెన్ 65 అంటే 65 రకాల మసాలాలు వాడతారని లేదా 65 రోజుల కోడిని వాడుతారని రకరకాలుగా అనుకుంటారు. కానీ అసలు కారణం ఏంటంటే.. ఈ వంటకాన్ని 1965లో చెన్నైలోని ప్రసిద్ధ బుహారీ హోటల్‌లో మొదటిసారి ప్రవేశపెట్టారు. ఆ సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి హోటల్ వ్యవస్థాపకులు దీనికి ‘చికెన్ 65’ అని పేరు పెట్టారు.
రుచి వెనుక రహస్యం:
చికెన్ 65 అంత రుచిగా ఉండటానికి కారణం దాని మ్యారినేషన్. పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) మరియు ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో ముక్కలను నానబెట్టి.. ఆపై డీప్ ఫ్రై చేస్తారు. దీనివల్ల ముక్క బయట క్రిస్పీగా మరియు లోపల మెత్తగా, జ్యుసీగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్త గుర్తింపు:
చెన్నైలో మొదలైన ఈ రుచి ప్రయాణం కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేడు చికెన్ 65 లేని నాన్-వెజ్ మెనూ కార్డు ఉండదంటే అతిశయోక్తి కాదు. కేవలం స్టార్టర్ గానే కాకుండా, బిర్యానీతో కలిపి కూడా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.