Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Conocarpus Trees: అమ్మ బాబోయ్.. ఈ చెట్లు యమ డేంజర్.. వీటి గాలి పీలిస్తే డైరెక్టుగా నరకానికే..

మీరిప్పటివరకు కాకులు దూరని కారడవి గురించి వినుంటారు.. కానీ పిట్టలు కూడా వాలని చెట్ల గురించి విన్నారా? అవును తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కోనోకార్పస్ చెట్ల గురించే మనం మాట్లాడుకుంటున్నది. వీటిని తొలగించాలనే చర్చ ఎంతో కాలంగా నడుస్తున్నప్పటికీ ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో దీని ప్రస్తావన రావడంతో మరోసారి ఈ రాకాసి చెట్లు వార్తల్లో నిలిచాయి. చూడ్డానికి అందంగా చూపు తిప్పుకోనివ్వకుండా ఉండే ఈ చెట్లు ప్రాణాలు తీసే కారకాలను కూడా కలిగి ఉన్నాయి.

Conocarpus Trees: అమ్మ బాబోయ్.. ఈ చెట్లు యమ డేంజర్.. వీటి గాలి పీలిస్తే డైరెక్టుగా నరకానికే..
Conocorpus Trees In Telangana Dangerous
Follow us
Bhavani

|

Updated on: Apr 01, 2025 | 9:59 AM

తెలంగాణలోని అసెంబ్లీ చర్చల నుంచి పాకిస్తాన్ వంటి దేశాల వరకు కోనోకార్పస్ చెట్ల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చెట్లు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, వాటిని తొలగించాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయం ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది? కోనోకార్పస్ చెట్లు ఏమిటి, వీటి వల్ల ఏ సమస్యలు తలెత్తుతున్నాయి, ఎందుకు వీటిని నిర్మూలించాలనే డిమాండ్ వస్తోందనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

కోనోకార్పస్ చెట్లు అంటే ఏమిటి?

కోనోకార్పస్ చెట్లు శంఖు ఆకారంలో పచ్చగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. డివైడర్లలో, పార్కులలో, నగర సుందరీకరణలో భాగంగా ఈ చెట్లను ఎక్కువగా నాటారు. ఇవి అమెరికా ఖండంలోని తీర ప్రాంతాలకు చెందిన మాంగ్రూవ్ జాతి మొక్కలు, ముఖ్యంగా ఫ్లోరిడా వంటి ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చాయి. వేగంగా పెరగడం, ఎక్కువ నీరు అవసరం లేకపోవడం వంటి లక్షణాలతో ఇవి ఆకర్షణీయంగా కనిపించినా, వాటి ప్రభావం పర్యావరణంపై, మానవ ఆరోగ్యంపై ప్రతికూలంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, అరబ్ దేశాలు, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఈ చెట్లను విస్తృతంగా పెంచారు. నగరాల్లో పచ్చదనాన్ని పెంచడం, ఎడారి ప్రాంతాల్లో దుమ్ము, ఇసుక తుఫాన్లను అడ్డుకోవడం వంటి ఉద్దేశాలతో మొదట్లో ఈ చెట్లను ఎంచుకున్నారు. అయితే, కాలక్రమంలో వీటి దుష్ప్రభావాలు బయటపడడంతో చాలా ప్రభుత్వాలు వీటిని తొలగించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

తెలంగాణలో అసెంబ్లీలో చర్చ..

తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 273 కోట్ల మొక్కలు నాటినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని చెప్పారు. అయితే, ఈ మొక్కల్లో గణనీయమైన సంఖ్యలో కోనోకార్పస్ చెట్లు ఉన్నాయని, అవి పర్యావరణానికి హానికరమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ, “ఈ చెట్లకు నీళ్లు అవసరం లేదు, ఎక్కడపడితే అక్కడ పెరుగుతాయి. ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. వీటిపై పక్షులు కూడా కూర్చోవు. అలాంటి చెట్లను తెలంగాణ వ్యాప్తంగా నాటడం సరికాదు,” అని విమర్శించారు. వీటిని వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. 2022లోనే తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఈ చెట్లను పెంచవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇప్పటికీ వీటి నిర్మూలనపై చర్చ కొనసాగుతోంది.

పర్యావరణంపై ప్రభావం..

కోనోకార్పస్ చెట్లు వేగంగా పెరుగుతాయి కానీ వాటి వేర్లు బలంగా ఉండి భూగర్భంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. దీనివల్ల నీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటాయి. అరబ్ దేశాల్లో ఈ చెట్లు భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తాయని, దీనివల్ల నీటి కొరత ఏర్పడుతుందని నిపుణులు గుర్తించారు. ఇరాక్‌లోని మిసాన్ ప్రావిన్స్‌లో జరిగిన అధ్యయనంలో ఈ చెట్ల వల్ల మౌలిక సదుపాయాలకు నష్టం కలిగినట్లు తేలింది. అంతేకాక, ఈ చెట్లు పక్షులకు ఆకర్షణీయంగా ఉండవు, వీటి పండ్లు లేదా పుష్పాలు ఎలాంటి ప్రయోజనం కలిగించవు. స్థానిక పర్యావరణ వ్యవస్థకు ఇవి అనుగుణంగా లేనందున, స్వదేశీ చెట్లకు బదులుగా వీటిని నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని వృక్షశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం..

కోనోకార్పస్ చెట్లు మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇవి శ్వాసకోశ సమస్యలు, అలర్జీలకు కారణమవుతాయి. పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ చెట్ల వల్ల ఆస్థమా రోగుల సంఖ్య పెరిగినట్లు పరిశోధనలు వెల్లడించాయి.

పాకిస్తాన్, ఇతర దేశాల అనుభవాలు…

పాకిస్తాన్‌లో కరాచీ, ఇస్లామాబాద్‌లో ఈ చెట్లను పెంచినప్పుడు మొదట్లో పచ్చదనం కోసం ఉపయోగపడినా, తర్వాత వాటి దుష్ప్రభావాలు బయటపడ్డాయి. కరాచీ యూనివర్సిటీ అధ్యయనాలు ఈ చెట్ల వల్ల గాలి నాణ్యత దెబ్బతిని, ఆస్థమా కేసులు పెరిగాయని నిర్ధారించాయి. అరబ్ దేశాల్లో కూడా ఇవి భూగర్భ జలాలను అధికంగా వాడటం, నిర్మాణాలకు నష్టం కలిగించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ అనుభవాల ఆధారంగా కొన్ని దేశాలు వీటి పెంపకాన్ని నిషేధించాయి.

కోనోకార్పస్ చెట్లు మొదట్లో పచ్చదనం, సౌందర్యం కోసం ఎంచుకున్నప్పటికీ, వాటి దీర్ఘకాలిక ప్రభావాలు పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయని తేలడంతో తెలంగాణ నుంచి పాకిస్తాన్ వరకు వీటిపై చర్చ ఊపందుకుంది. స్థానిక జాతులైన చింత, వేప, మర్రి వంటి చెట్లను నాటడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.