శివలీల.. కళ్లముందే మాయమయ్యే ఆలయం.. ప్రకృతి దాచిన అద్భుతం ఎక్కడుందో తెలుసా..?

కళ్ల ముందే కనిపించే ఒక మహా శివాలయం.. కొన్ని గంటల్లోనే సముద్ర గర్భంలో మాయమైపోతుంది.. మళ్లీ కొద్దిసేపటికి ఏమీ జరగనట్లు బయటకు ప్రత్యక్షమవుతుంది.. ఇది వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తున్నా.. గుజరాత్‌లోని స్తంభేశ్వర మహాదేవ ఆలయంలో ప్రతిరోజూ జరిగే నిజమైన అద్భుతం. అసలు రోజుకు రెండుసార్లు ఈ ఆలయం ఎందుకు అదృశ్యమవుతుంది? దీని వెనుక ఉన్న ప్రకృతి రహస్యమేంటి? అనేది తెలుసుకుందాం..

శివలీల.. కళ్లముందే మాయమయ్యే ఆలయం.. ప్రకృతి దాచిన అద్భుతం ఎక్కడుందో తెలుసా..?
Stambheshwar Mahadev Temple

Updated on: Jul 22, 2026 | 7:05 AM

మన దేశంలో ఆధ్యాత్మికతకు, ప్రాచీన సంస్కృతికి కొదవ లేదు. మనదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాల నిర్మాణ శైలి, అక్కడ జరిగే వింతలు చూస్తే ఆధునిక విజ్ఞానం కూడా ఆశ్చర్యపోవాల్సిందే. అటువంటి అద్భుతమైన, విస్మయపరిచే పుణ్యక్షేత్రాలలో ఒకటి గుజరాత్‌లో ఉంది. అదే స్తంభేశ్వర మహాదేవ దేవాలయం. రోజుకు రెండుసార్లు కళ్లముందే మాయమై మళ్లీ ప్రత్యక్షమయ్యే ఈ మహాదేవుని ఆలయం వెనుక ఉన్న అసలు రహస్యం గురించి చాలా ముందికి తెలియదు. సుమారు 200 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ స్తంభేశ్వర మహాదేవ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. రోజుకు రెండుసార్లు ఈ ఆలయం సముద్ర గర్భంలోకి వెళ్లిపోతూ భక్తులను అబ్బురపరుస్తుంది.

ఆలయం అదృశ్యం కావడం వెనుక ఎలాంటి చేతబడులు లేదా మూఢనమ్మకాలు లేవు. ఇది పూర్తిగా ప్రకృతి చేసే విచిత్రమైన విన్యాసం. ఈ పురాతన ఆలయం సరిగ్గా సముద్ర తీరంలో ఉంటుంది. సముద్రంలో పోటు వచ్చిన ప్రతిసారీ ఎత్తైన, బలమైన అలలు పైకి లేచి ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తుతాయి. ఈ సమయంలో ఆలయంలోని ప్రధాన శివలింగానికి సముద్ర తరంగాలే స్వయంగా జలాభిషేకం చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ అలల పోటు కారణంగా ఆలయం నీటిలో మునిగిపోయి, మన కళ్లకు అదృశ్యమైనట్లు కనిపిస్తుంది. పోటు తగ్గిన తర్వాత ఆలయం మళ్లీ యథాతథంగా దర్శనమిస్తుంది.

కార్తికేయుడు ప్రతిష్టించిన చారిత్రక క్షేత్రం

స్కంద పురాణం ప్రకారం.. ఈ ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శివుని కుమారుడైన కుమారస్వామి తారకాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆ రాక్షసుడు పరమశివుని గొప్ప భక్తుడని తెలుసుకుని బాధపడతాడు. ఆ పాప పరిహార్థం, శివాజ్ఞ మేరకు కుమారస్వామి స్వయంగా ఈ ప్రదేశంలో మహాలింగాన్ని ప్రతిష్టించి స్తంభేశ్వర మహాదేవుడుగా నామకరణం చేశారని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయానికి ఎలా చేరుకోవాలి?

ఈ వింతను, శివుని దివ్య దర్శనాన్ని కళ్లారా చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఈ క్షేత్రం గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో వడోదర సమీపంలోని జంబుసర్ తాలూకా కంబోయ్ గ్రామంలో ఉంది. ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయం లేదా వడోదర పర్యటనకు వెళ్లే భక్తులు, ఈ స్తంభేశ్వర మహాదేవ ఆలయాన్ని చాలా సులువుగా సందర్శించవచ్చు.

భక్తిని, ప్రకృతి అందాన్ని ఒకే వేదికపై ఆస్వాదించాలనుకునే వారికి స్తంభేశ్వర మహాదేవ ఆలయం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అయితే అలల వేగం ఎక్కువగా ఉండే పోటు సమయంలో భక్తులను సముద్రంలోకి అనుమతించరు. పోటు తగ్గాకే ఆలయ ప్రాంగణంలోకి అనుమతిస్తారు.

Follow Us