Telugu Astrology: శని, రాహువు అనుకూలత.. ఈ రాశులకు విదేశీ ఉద్యోగ యోగం..!
Foreign Job Opportunities: మార్చి 29న శని మీనరాశిలోకి, మే 18న రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీని ప్రభావంతో విదేశీ అంశాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశముంది. కొన్ని రాశుల వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు పెరుగే అవకాశముంది. విదేశీ స్థిర నివాసం, ఉన్నత విద్య, వివాహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశుల వారు తక్కువ ప్రయత్నంతో విదేశీ ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలను పొందే అవకాశం ఉంది.

Foreign Job Opportunities
Saturn and Rahu Transit: మార్చి 29న శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారడంతో పాటు, మే 18 నుంచి రాహువు కూడా మీన రాశి నుంచి కుంభ రాశిలోకి మారడం వల్ల విదేశీ సంబంధమైన పరిణామాలకు ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశం ఉంది. శని, రాహువులిద్దరూ విదేశాలకు కారకులు. ఇవి బలంగా ఉన్న పక్షంలో విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, విదేశాల్లో స్థిరపడడం, విదేశీయానాలు, విదేశాల్లో ఉన్నవారితో పెళ్లి సంబంధాలు అనుకూలంగా సాగిపోతాయి. వృషభం, మిథునం, సింహం, తుల, మకరం, మీన రాశుల వారికి విదేశీ సంబంధమైన విషయాల్లో అదృష్టాలు పట్టే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శని, రాహువుల సంచారం వల్ల తప్పకుండా విదేశాల్లో స్థిరపడే అవకాశం కలుగుతుంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాల నుంచి అనేక ఆఫర్లు అందుతాయి. స్వదేశంలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి విదేశాలకు వెళ్లవలసిన అవసరాలు ఏర్పడతాయి. ఇతర దేశాల సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి దశమ, భాగ్య స్థానాల్లో శని, రాహువుల సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా ఉన్నత విద్యల కోసం కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. స్వదేశంలోనే విదేశీ సంస్థలో పనిచేసే అవకాశంకలుగుతుంది. విదేశాల్లో స్థిరత్వం లభిస్తుంది.
- సింహం: ఈ రాశివారికి ఈ ఏడాది తప్పకుండా విదేశాలకు వెళ్లే యోగం పడుతుంది. ఉద్యోగరీత్యానే కాక పర్యాటకంలో భాగంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో నిరు ద్యోగులకు విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఇతర దేశాల్లో ఉద్యోగం చేయాలనే కల తప్పకుండా నెరవేరుతుంది. స్వదేశంలోని ఉద్యోగులు ఉద్యోగరీత్యా అనేక పర్యాయాలు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాలరీత్యా తప్పకుండా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. శని, రాహువులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఉద్యోగంలో అధికారులు విదేశాలకు పంపించే సూచనలున్నాయి. రాబోయే ఒకటి రెండు నెలల్లో విదేశాలకు వెళ్లినవారు తప్పకుండా అక్కడే స్థిరపడే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారికి మరో రెండు మూడేళ్ల పాటు విదేశీ సంపాదన అనుభవించే యోగం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం వెళ్లడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయి, మార్గం సుగమం అవుతుంది. అతి తక్కువ ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. ఉన్నత విద్యలు, పరిశోధనల కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులతో పాటు వృత్తి జీవితంలో ఉన్నవారికి కూడా అనేక అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధమే తేలికగా కుదిరే అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. శని, రాహువుల రాశి మార్పు వల్ల వీరికి అందుకు సంబంధించిన అనుకూలతలు, అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు సైతం విదేశాల నుంచి ఆహ్వానాలు అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి అన్ని విధాలా స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత విద్యల కోసం విద్యార్థులకు విదేశీ యోగం పడుతుంది.