Saraswati River: సరస్వతి నది నిజంగా ఉందా..? లేక అభూత కల్పన!
సరస్వతి... ఈ నది గురించి పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకాల్లోనూ చదువుకున్నాం. ఒకప్పుడు ఉత్తర భారతంలో సరస్వతి నది ప్రవహించేదని చెబుతుంటారు. ఇప్పుడది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని అంటున్నారు. ఇటీవల మహా కుంభమేళా జరిగిన ప్రయాగ్ రాజ్లో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చాలా మంది విశ్వాసం. అక్కడ గంగా, యమునా, సరస్వతి నదులు కలుస్తాయని అందుకే ఆ ప్రాంతానికి త్రివేణి సంగమమన్న పేరు వచ్చిందని అంటారు. ఇదిలా ఉంటే ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గోదావరి, ప్రాణహిత సంగమం వద్ద అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తోందని అందుకే ఆ ప్రాంతాన్ని త్రివేణీ సంగమమని పిలుస్తారని అంటోంది. మరి అటు ప్రయాగ్ రాజ్, ఇటు కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా ప్రవహంచే సరస్వతి నది ఒకటేనా.. లేక రెండూ వేర్వేరా..? అసలు సరస్వతి నది నిజంగా ఉందా లేక అదో అభూత కల్పనా?

దేశంలో గంగా, యమున, నర్మద, కావేరి, భీమరథి, సరస్వతి, గోదావరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత తదితర 12 జీవనదులు ప్రవహిస్తున్నాయి. వీటినే పుష్కర నదులు అంటారు. ఈ 12 నదులకు పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాలను కూడా రాశులకు అనుగుణంగా నిర్వహిస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సరస్వతి పుష్కరాలకు సిద్ధమవుతోంది. మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల ఏర్పాట్ల కోసం 25కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కాళేశ్వరం వద్ద సరస్వతి నది ప్రవహిస్తున్న ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు. అక్కడ నది ప్రవహిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరి ఈ పుష్కరాల సంగతేంటి?
మరోవైపు యూపీలోని ప్రయాగ్ రాజ్లో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అక్కడ యమున, గంగానది కలుస్తాయి. త్రివేణీ సంగమమంటే మూడు నదుల కలయిక. కానీ ప్రయాగ్ రాజ్ లో కనిపించేది రెండు నదులే కదా అన్న అనుమానం కలుగకమానదు. భక్తుల విశ్వాసం, కొన్ని పరిశోధనల ప్రకారం అక్కడ ప్రవహించే మూడో నది సరస్వతి. ప్రయాగలో సరస్వతి నది పైకి కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందన్నది హిందువుల విశ్వాసం.
అసలు సరస్వతి నది ఉందా లేదా అనే అంశంపై ఏళ్లుగా వాదోపవాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరస్వతి నది అంతర్ధానమైనా, ఆ నది ఉనికి ఇప్పటికీ ఉందని చాలామంది నమ్ముతారు. హర్యానాలో పుట్టిన సరస్వతి నది గుజరాత్‌లోకి ప్రవేశించి కచ్ వద్ద సముద్రంలో కలిసేదట. పవిత్రమైన చతుర్వేదాలలో రుగ్వేదం అత్యంత పురాతనమైంది. రుగ్వేదంలోని 45వ శ్లోకంలో సరస్వతి నది ప్రస్తావన ఉంది. సరస్వతి ఉత్కృష్టమైందని, నిండుగా ప్రవహిస్తుందని ఇలా రుగ్వేదంలో మొత్తం 72సార్లు సరస్వతిని స్తుతించారు.
సరస్వతి నదిని సింధుమాత అని కూడా పిలుస్తారు. అంటే నదులకు తల్లి అని అర్థం. మహా భారతంలోని శల్యపర్వం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు పాల్గొనలేదు. ఆ సమయంలో ఆయన యాత్రలో ఉన్నాడట. ద్వారక నుంచి మొదలైన ఆ యాత్ర వినాశన్ అనే ప్రాంతానికి చేరుకున్నాక అక్కడ సరస్వతి నది అంతర్థానమైపోయినట్లు గుర్తించారట. ఇప్పుడు ఆ ప్రాంతం థార్ ఎడారిలో ఉందని నమ్ముతారు.
సరస్వతి నది మనుగడ గురించి తెలిస్తే.. హరప్పా, వేద నాగరికత సరిహద్దుల గురించి తెలుస్తుందన్నది పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. నిజానికి ఈ సరిహద్దు తూర్పు అప్ఘనిస్తాన్ నుంచి సింధు, గంగ యమునా ప్రాంతాల వరకు విస్తరించిందని అంటారు. తూర్పు ఆప్ఘనిస్తాన్లో సరస్వతి నది పుట్టిందని అక్కడ దాన్ని హరక్స్వతి అని పిలుస్తారన్నది కొందరి వాదన. హరక్స్వతి నుంచే సరస్వతి అనే పేరు వచ్చి ఉంటుందని.. రుగ్వేద కాలంలోనే ఆ నది ఒడ్డున ప్రజలు నివసించి ఉంటారని చెబుతారు.
శ్రీమద్భాగవతం ప్రకారం మానస సరోవరం, బిందు, నారాయణ, పంపా, పుష్కర సరోవరాలు హిందువులకు పవిత్రమైనవి. కచ్‌లోని నారాయణ సరోవరం విష్ణు సంబంధమైనది. దాని సమీపంలోనే సరస్వతి నది ప్రవహించేదని చెబుతారు. సరస్వతి నది ప్రవాహంతోనే ఈ సరోవరం నిండేదట. మరికొందరి ప్రకారం సరస్వతి నది బ్రహ్మ కుమార్తె. ఆమె కౌషంబి రాజ్యానికి చక్రవర్తైన పురూరవ మహారాజుకు ఆకర్షితురాలైందట. ఈ విషయం బ్రహ్మకు తెలిసి కోపంతో.. సరస్వతిని మాయమైపోవాలంటూ శపించాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.
పురాణ వర్ణనల ప్రకారం సరస్వతి నది గంభీరమైంది. పర్వతాలలో పుట్టి సముద్రంలో కలుస్తుంది. అయితే సరస్వతిది నదీ రూపం కాదు.. దేవతా రూపం అని భక్తుల విశ్వాసం. మరోవైపు ప్రస్తుత సింధూనదే నాటి సరస్వతి నది అని మరికొందరు నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం హర్యానాలో సరస్వతి పేరుతో ఓ నది ప్రవహిస్తోంది. కానీ అది పర్వతాల్లో పుట్టింది కాదు.. సముద్రంలో కలిసేది అంతకన్నా కాదు. హర్యానాలోని సరస్వతి నది జన్మస్థలం యమునానగర్ లోని ఆదిబద్రి. ఆ నది హర్యానా, రాజస్థాన్, పాకిస్థాన్ మీదుగా ప్రవహించి శివాలిక్ పర్వత శ్రేణుల వద్ద కచ్ వద్ద సముద్రంలో కలుస్తుంది. అందుకే సరస్వతి నదిపై అనేక సందేహాలు ఉన్నాయి. దాని ఉనికిపై శతాబ్దానికిపైగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తల మధ్య చర్చ నడుస్తూనే ఉంది.
హిందువుల విశ్వాసం ప్రకారం గంగ, యమున, సరస్వతి ప్రయాగరాజ్‌లో సంగమిస్తాయి. అక్కడ ప్రతి 12 ఏళ్ళకోసారి కుంభమేళా జరుగుతుంది. అక్కడ యమునా నది నీళ్లు నల్లగానూ, గంగానది నీళ్లు గోధుమరంగులోను ఉంటాయి. అయితే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని స్థానికుల నమ్మకం. భౌగోళిక ఒడిదొడుకుల కారణంగా సరస్వతి నది ఏకరీతిలో ఉండదన్నది మరికొందరి వాదన. ఇదిలా ఉంటే సరస్వతి నది హర్యానాలో పుట్టి కచ్ ఎడారివైపు ప్రవహిస్తే.. ప్రయాగ్రాజ్లో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది సంగతేంటన్న అనుమానం కలుగకమానదు. అయితే ఆదిబద్రి వద్ద జన్మించే సరస్వతి నది రెండు పాయలుగా విడిపోయి.. ఒకటి రాజస్థాన్లోని కురుక్షేత్ర మీదుగా ప్రయాగ్ రాజ్ వైపు ప్రవహిస్తుందట. మరో పాయ రోహ్తక్ జిల్లాలోని కార్నల్, రాజస్థాన్ లోని చురు మీదుగా ప్రవహించి కచ్ వద్ద సముద్రంలో కలిసేదట.
ఇదిలా ఉంటే పరిశోధనలు సైతం సరస్వతి నది ఉనికి గురించి స్పష్టంగా చెప్పలేకపోయాయి. కొందరు శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా హిమాలయాల నుంచి కచ్ వరకు సరస్వతి నది ద్వారా అవక్షేపాలు ప్రవహించినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా సరస్వతి నది వర్షాధారం కాదని, హిమనీ నదమని తేల్చారు. కాలక్రమంలో సింధు, సరస్వతి నదులు పశ్చిమం వైపు మళ్లాయని థార్ ఎడారి విస్తరించడంతో సరస్వతి నది పూర్తిగా అదృశ్యమైందన్నది వారి మాట. వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా సరస్వతి నది కనుమరుగయ్యేందుకు కారణమైందన్నది మరికొందరి వాదన.
సరస్వతి నది ఆనవాళ్లను తెలుసుకునేందుకు 2002లో కేంద్ర ప్రభుత్వం ఇస్రో, పురావస్తు శాఖ, గ్లేసియాలజిస్టులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులు రాజస్థాన్ తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి సమాచారాన్ని సేకరించారు. దాని ఆధారంగా 2015 నవంబర్ 28న ఓ నివేదికను విడుదల చేసింది. అందులో భూగర్భజలాలు అట్టడుగున ఉండే జోధ్పూర్లో 120 నుంచి 150 మీటర్ల లోతులోనే 14 చోట్ల ఇవి ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జైసల్మీర్లోని 10 ప్రాంతాల్లోని భూగర్భ నీటి నమూనాలు పరిశీలించగా.. ఆ నీరు 1900 నుంచి 18వేల 800 సంవత్సరాల క్రితం నాటిదని బాబా అటామిక్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ తేల్చిందని రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ లెక్కన ఆ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించి ఉంటుందన్న అంచనాకు వచ్చారు. మొత్తమ్మీద సరస్వతి నది ఉనికి నిరంతరం చర్చనీయాంశం. ఆ నది కనుమరుగైనా.. అంతర్వాహినిగా ప్రవహిస్తున్నా హిందువులకు అదో నమ్మకం. ఎవరూ కాదనలేని విశ్వాసం.