AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 అడుగుల కొండచిలువకు దవడ క్యాన్సర్.. నయం చేసిన వైద్యులు..

బ్రిటన్‌లోని చెస్టర్ జూలో 15 అడుగుల జోడీ ఫోస్టర్ అనే కొండచిలువకు దవడ క్యాన్సర్ సోకగా, వైద్యులు అరుదైన ఎలక్ట్రో కీమోథెరపీని విజయవంతంగా నిర్వహించారు. మనుషులకు మాత్రమే చేసే ఈ చికిత్సను పాముకు అందించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. దీని ద్వారా జోడీ ఫోస్టర్ ప్రాణాలు నిలిచాయి.

15 అడుగుల కొండచిలువకు దవడ క్యాన్సర్.. నయం చేసిన వైద్యులు..
Python Cancer Treatment
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2026 | 9:37 AM

Share

క్యాన్సర్ అనే మహమ్మారి మనుషులను ఇప్పుడు విపరీతంగా కుంగదీస్తుంది. అలాంటిది ఒక పాముకు క్యాన్సర్ సోకితే, దాని ప్రాణాలను కాపాడటం ఎంత పెద్ద సవాల్. బ్రిటన్‌లోని చెస్టర్ జూలో సరిగ్గా ఇలాంటి అద్భుతమే జరిగింది. ఏకంగా 15 అడుగుల భారీ రెటిక్యులేటెడ్ కొండచిలువకు దవడ క్యాన్సర్ సోకగా, వైద్యులు ఓ సాహసోపేతమైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి, పశు వైద్య చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. సాధారణంగా మనుషులకు చేసే అధునాతన ఎలక్ట్రో కీమోథెరపీని ఆ పాముకు చేసి దాని ప్రాణాలను నిలబెట్టారు. 23 ఏళ్ల ఈ కొండచిలువ పేరు జోడీ ఫోస్టర్. హాలీవుడ్ నటి జోడీ ఫోస్టర్ పేరును గుర్తుచేసే ఈ కొండచిలువ, ఇటీవల దవడలో తీవ్రమైన ప్రాణాంతక కణితి (మాలిగ్నెంట్ ట్యూమర్) బారిన పడింది. ఈ కణితి దవడ ఎముకలను ప్రభావితం చేయడంతో, జోడీ ఫోస్టర్ ఆహారం తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. దీని బరువు దాదాపు 50 కిలోలు. పరిస్థితి విషమంగా మారడంతో, చెస్టర్ జూ పశు వైద్యులు, లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాన్సర్ నిపుణులతో కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మానవులకు అందించే క్యాన్సర్ చికిత్స పద్ధతులను జంతువులకు అనుగుణంగా మార్చి, వాటిని జోడీ ఫోస్టర్‌కు వర్తింపజేయాలని నిర్ణయించారు.

జూ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఇయాన్ ఆష్ఫోల్ నేతృత్వంలో ఈ అరుదైన ఆపరేషన్ జరిగింది. చికిత్సా ప్రక్రియ అనేక దశల్లో జరిగింది. ముందుగా, పాము దవడలోని క్యాన్సర్ కణితిని పూర్తిగా తొలగించారు. కణితి ప్రభావితం చేసిన దవడ ఎముకలోని కొంత భాగాన్ని కూడా జాగ్రత్తగా తొలగించారు. అనంతరం, మిగిలిన కణజాలంలోకి “బ్లియోమైసిన్” అనే క్యాన్సర్ ఔషధాన్ని ఉంచారు. ఆ తర్వాతి దశలో, చిన్న లోహపు ఎలక్ట్రోడ్‌ల ద్వారా నియంత్రిత విద్యుత్ పల్స్‌లను పంపి, బ్లియోమైసిన్ మందు క్యాన్సర్ కణాల్లోకి మరింత వేగంగా, సమర్థవంతంగా ప్రవేశించేలా చేశారు. ఈ ప్రక్రియనే ఎలక్ట్రో కీమోథెరపీ అంటారు. ఒక పాముకు ఎలక్ట్రో కీమోథెరపీని అందించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. పశువైద్య రంగంలో ఇది ఒక గొప్ప మైలురాయిగా పరిగణించబడుతోంది. చికిత్సానంతరం, జోడీ ఫోస్టర్ దవడ భాగం అనూహ్యంగా వేగంగా నయమైంది. కొన్ని నెలల తర్వాత, వైద్యులు ప్రకటించిన వివరాల ప్రకారం, జోడీ ఫోస్టర్ క్యాన్సర్ రహితంగా మారింది. ఇదివరకు ఎదుర్కొన్న ఆహార సమస్యలు లేవు, యథావిధిగా చురుగ్గా కదులుతూ, తన ఆహారాన్ని సులభంగా పట్టుకొని మింగుతోంది. డాక్టర్లు ఈ చికిత్స విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తూ, జోడీ ఫోస్టర్ మరో పదేళ్ల పాటు, అంటే 33 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అరుదైన విజయం జంతువుల వైద్య చికిత్సలో కొత్త ఆశలను రేకెత్తించింది.

Follow Us