మనిషికి పంది కిడ్నీ.. డయాలసిస్ రోగికి పునఃజన్మ ప్రసాదించిన వైద్యులు

అవయవ మార్పిడి చికిత్సలో రోజు రోజుకీ వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా అమెరికా వైద్యులు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మనిషి శరీరంతో అస్సలు సరిపడని మరో జీవి అవయవాన్ని ఓ వ్యక్తికి అమర్చి సక్సెస్ అయ్యారు. ఇది వారు విజయవంతంగా పూర్తి చేసిన నాలుగో ఆపరేషన్ కావడం విశేషం.

మనిషికి పంది కిడ్నీ.. డయాలసిస్ రోగికి పునఃజన్మ ప్రసాదించిన వైద్యులు
Pig Kidney Transplant

Updated on: Feb 12, 2025 | 4:22 PM

ఇప్పటివరకు వైద్య శాస్త్రానికి అందని ద్రాక్షలాగే ఉన్న చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. అమెరికాలోని మసాచుట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు ఓ వ్యక్తికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ఈ 66 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ వంటి జబ్బులతో బాధపడుతున్నాడు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని వైద్యులు అతడికి అమర్చారు.

తాజాగా చేసిన కిడ్నీ మార్పిడి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అవయవాల కొరతను తీర్చేందుకు కీలక ముందడుగు పడినట్టు వైద్యులు చెప్తున్నారు. ఈ మార్పిడి ద్వారా రోగికి ఇన్ ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు తగిన విధంగా ముందుగానే పంది కిడ్నీకి ల్యాబ్ లో జన్యుపరమైన మార్పులు చేసినట్టుగా తెలిపారు. అయితే, ఇది దీర్ఘకాలికంగా రోగికి ఎలా పనిచేయగలదనే విషయంపై మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామన్నారు.

టిమ్ ఆండ్రూస్ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇటీవల అతడికి డయాలసిస్ చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యాడు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తుండటంతో అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి మరింత విషమించడంతో వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. దీంతో ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి వైద్యులు అతడికి పునఃజన్మను ప్రసాదించారు.

అందరికీ అందుబాటులోకి రావాలి..

పంది నుంచి అవయవ మార్పిడి చేయడం సురక్షితమైనదేనని వైద్యులు ఇప్పటికే నిరూపించారు. గతంలో పంది గుండెను మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సర్జరీ ఖర్చు, వాటి బీమా కవరేజీ వంటి కారణంగా ఇది అందరు రోగులకు అందుబాటులో లేకుండా పోతోంది.

లక్షల్లో గ్రహీతలు..

గణాంకాల ప్రకారం అమెరికాలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. మానవ మూత్రపిండాల కోసం ప్రయత్నించినప్పటికీ వీటి కొరత చాలా ఉంటోంది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

రిస్క్ తక్కువనే..

అందుకే పలు బయోటెక్ కంపెనీలు పందుల అవయవాల్లో జన్యు పరమైన మార్పులు చేస్తున్నారు. దీనిని మానవ శరీరం తిరస్కరించే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఆండ్రూస్ అందుకున్న పంది కిడ్నీకి వైద్యులు 69 రకాల జన్యు సవరణలు చేశారు. ఇన్ ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి 59 మార్పులు చేశారు.