అడవికి సింహం రాజైతే.. ఇది ఆకాశానికి రారాజు.. క్షణాల్లో శత్రువు ప్రాణాల్లో గాల్లోనే..

సింహం అడవికి రాజైతే, ఈ పక్షి ఆకాశానికి రారాజు. ఒక చిన్న గుడ్డు నుండి ఆకాశాన్ని ఏలే అద్భుతమైన వేటగాడిగా మారిన ఈ పక్షి ప్రయాణం, దాని శరీరంలోని ప్రత్యేక లక్షణాలు, వేట పద్ధతులు ప్రతి ఒక్కరికి విస్మయం కలిగిస్తాయి. తన ఎరను వేటాడే సమయంలో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌లా దూసుకెళ్లే ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవిగా గుర్తింపు పొందింది. ఇంతకూ ఆ పక్షి ఏదనేగా మీ డౌట్ అది తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.

అడవికి సింహం రాజైతే.. ఇది ఆకాశానికి రారాజు.. క్షణాల్లో శత్రువు ప్రాణాల్లో గాల్లోనే..
Meet The World's Fastest Hunter

Edited By:

Updated on: May 06, 2026 | 12:05 PM

పెరెగ్రీన్ ఫాల్కన్.. ఇదే ప్రపంచలోనే అత్యంత వేగంగా ప్రయాణించే పక్షి.. అడవికి సింహం రాజైతే.. గంటలకు 320 కిలో మీటర్ల బుల్లెట్‌ వేగంతో ప్రయాణించే ఈ పక్షి ఆకాశానికి రారాజు. ఇది మిగతా పక్షల్లా కాకుండా తన గూడును అత్యంత ఎత్తైన కొండల అంచుల్లో, శత్రువులకు అందనంత ఎత్తులో నిర్మిస్తుంది. సుమారు 35 రోజుల పాటు తల్లి పక్షి ఆ గుడ్డును గడ్డకట్టే చలిని తట్టుకుంటూ కాపాడుతుంది. ఈ పక్షి పుట్టినప్పుడు బలహీనంగా ఉన్నా, కేవలం 20 రోజుల్లోనే దాని బరువు రెట్టింపు అవుతుంది. గూడు అంచున నిలబడి వేల అడుగుల లోయను చూస్తూ తన రెక్కలను ఆడించడం మొదలు పెడుతుంది. ఆ భయాన్ని జయించినప్పుడే అది నిజమైన డేగగా మారుతుంది.

ప్రకృతి ప్రసాదించిన 4K కళ్ళు

ఈ పక్షికి ప్రకృతి అద్భుతమైన కళ్ళను ప్రసాదించింది. దీని చూపు ఎంత పదునైనదంటే, ఒక కిలోమీటర్ ఎత్తులో ఎగురుతున్నా సరే, నేల మీద వెళుతున్న ఒక చిన్న ఎలుకను కూడా ఇది స్పష్టంగా చూడగలదు. దీని కళ్ళల్లో మనుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ క్లారిటీ ఉంటుంది. మనం టీవీలో 4K వీడియో చూస్తున్నట్టు ఇది ప్రకృతిని అంత స్పష్టంగా చూడగలదు. వేట సమయంలో ఎర ఎక్కడున్నా సరే, దీని కళ్ళు నేరుగా దానిపైకే వెళ్తాయి.

అద్భుతమైన శరీర నిర్మాణం 

ఇది తన ఎరను వేటాడేప్పుడు గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కిందకు దూకువస్తుంది. అప్పుడు గాలి ఒత్తిడికి దీని ఊపిరితిత్తులు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ దీని ముక్కు రంధ్రాలలో ట్యూబర్కిల్స్ అనే చిన్న ఎముకలు ఉంటాయి. ఇవి లోపలికి వచ్చే గాలి వేగాన్ని నియంత్రించి, పక్షికి ఎలాంటి హాని కలగకుండా కాపాడతాయి. ఆధునిక జెట్ ఇంజిన్లను తయారు చేసేటప్పుడు ఇంజనీర్లు సైతం ఈ డేగ ముక్కు ఆకారాన్ని చూసే స్ఫూర్తి పొందడం విశేషం.

వేట సమయంలో ఈ పక్షి గుండె నిమిషానికి 800 నుండి 900 సార్లు కొట్టుకుంటుంది. ఇంత వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయడం వల్లే అది అంత వేగంగా గాలిలో విన్యాసాలు చేయగలుగుతుంది. దీని రెక్కలు సెకనుకి 10 నుండి 12 సార్లు కొట్టుకుంటూ గాలిని చీల్చుకుంటూ వెళ్తాయి. అంత వేగంతో దూకుతున్నప్పుడు కళ్ళు ఆరిపోకుండా ఉండటానికి దీనికి మూడవ కనురెప్ప ఉంటుంది. ఇది ఒక వైపర్ లాగా పనిచేస్తూ కళ్ళను తేమగా ఉంచుతుంది, అలాగే ధూళి పడకుండా కాపాడుతుంది.

పెరెగ్రీన్ ఫాల్కన్ వేటలో నాలుగు ముఖ్యమైన దశలు ఉంటాయి

ఒకటి గాలిలో నిఘా: ఇది వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ తన టెలిస్కోపిక్ కళ్ళతో ఆకాశాన్ని స్కాన్ చేస్తుంది.

రెండోది ద స్టూప్: ఎరను గుర్తించగానే తన రెక్కలను శరీరానికి గట్టిగా ముడుచుకుంటుంది. అప్పుడు దీని శరీరం ఒక రాకెట్ లాగా మారి, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నేరుగా కిందకు దూకుతుంది.

మూడోది ద కిల్లర్ స్ట్రైక్: ఆ బుల్లెట్ వేగంతో వచ్చి తన పంజాను ఒక పిడికిలిలా బిగించి ఎదుటి పక్షి మెడ మీద బలంగా కొడుతుంది. ఆ దెబ్బకి ఎదుటి పక్షి ఎముకలు ఒక్క క్షణంలో పొడి పొడి అయిపోతాయి.

నాలుగోది గాలిలోనే పట్టుకోవడం: పంజా దెబ్బకి కింద పడిపోతున్న ఎరను అది నేల తాకకముందే గాలిలోనే తిరిగి పట్టుకుంటుంది.

దీని వేగం, సమయం ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాయంటే ఎదుటి పక్షికి అసలు ఏం జరిగిందో తెలిసేలోపే దాని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. పెరెగ్రీన్ అంటే లాటిన్ భాషలో యాత్రికుడు అని అర్థం. ఇవి వలస వెళ్లేటప్పుడు సుమారు 25 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అంటార్కిటికా తప్ప ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఇవి కనిపిస్తాయి. లక్ష్యం ఎంత ఎత్తులో ఉన్నా, భయాన్ని వదిలి మన శక్తి మీద మనకు నమ్మకం ఉంటే ఆకాశాన్ని కూడా జయించవచ్చు అని పెరెగ్రీన్ ఫాల్కన్ నిరూపిస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us