కన్న తండ్రి ఆరాటం.. కొడుకు బతికే ఉంటాడన్న ఆశతో.. నేపాల్ వరదల్లో కన్నీటి గాథ !

వరదల్లో గల్లంతయిన తన కొడుకు కోసం నేపాల్ కొండల్లో నివాసం ఉంటున్న ఓ తండ్రి, ఆకలి దప్పులను లెక్కచేయకుండా సాగిస్తున్న అన్వేషణ అందరినీ కలచివేస్తోంది.  ఒంట్లో సత్తువ లేకపోయినా.. కన్న కొడుకు వినోద్ జాడ కోసం తల్కా సదా వారం రోజులుగా  పర్వతాలు, రోడ్ల గుండా మైళ్ల కొద్దీ నడుస్తున్నాడు. మడమల నొప్పులు, ఆకలి, నిస్సహాయత కమ్ముకుంటున్నా.. కొడుకు ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడనే ఆశ, "నాన్నా" అని పిలవకపోతాడా అనే నమ్మకమే అతనిని ముందుకు నడిపిస్తున్నాయి. సప్తరి జిల్లా నుంచి ఖాట్మండులోని నువాకోట్ జలవిద్యుత్ కేంద్రానికి చేరుకున్నాడు. 

కన్న తండ్రి ఆరాటం.. కొడుకు బతికే ఉంటాడన్న ఆశతో.. నేపాల్ వరదల్లో కన్నీటి గాథ !
Father Walks For Days To Search For Missing Son In Nepal

Updated on: Sep 04, 2026 | 12:53 PM

ఆకస్మిక వరదల విషాదానికి  దాదాపు వారం కావస్తుంది. నేపాల్ వరదల బీభత్సంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు.   గల్లంతయిన దాదాపు 3 వేల మంది ఆచూకీ దొరకలేదు..  తన కొడుకు వినోద్  కోసం తల్కా సదా  వెతికీ వెతికీ అలసిపోయాడు. ఒంట్లో శక్తి లేదు, నిలబడే ఓపిక కూడా లేదు. అయినా కన్న కొడుకు కోసం ఆ తండ్రి వెతుకులాట వారం రోజులుగా సాగుతూనే ఉంది. కొడుకు ఆచూకీ కోసం నేపాల్ కొండల మధ్య ఎన్నో మైళ్ళు నడిచాడు.  ఆకలి దహించి వేస్తోంది, ఒంట్లో అలసటతో కోపం వస్తోంది. కొడుకు ఇంకా దొరకలేదనే బాధ, గుండెకోత అంతా ఇంతా కాదు.

మనసులో ఆశలు చనిపోతున్నాయి, నిస్సహాయత కమ్మేస్తోంది. అయినా సరే, కొడుకు ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడనే ఆ చిన్న నమ్మకమే అతనిని ముందుకు నడిపిస్తోంది. ‘‘నాన్నా’’ అని తనను పిలవకుండా ఉంటాడా అనే ఆ ఒక్క ఆశే ఆ తండ్రి అడుగులను ముందుకు పడేలా చేస్తోంది.

వయసు యాభై ఏళ్లు. కొడుకు కోసం కొండలు, గుట్టలు ఎక్కుతూ వెతుకుతున్న తల్కా సదా శివాలిక్ కొండ ప్రాంతం నుంచి బయలుదేరాడు. హిమాలయ ప్రాంతంలో నివాసం ఉండే వలసదారులను మధేసీలు అంటారు. తల్కా సదాకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు.  భోటేకోశి నదికి వరదలు రావడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు సదా తన 19 ఏళ్ల కొడుకు వినోద్‌తో చివరిసారిగా మాట్లాడాడు. వరదల వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రసువా జిల్లాలోని ఒక జల విద్యుత్ ప్లాంట్‌లో కూలీ పనికి వినోద్ నెల రోజుల క్రితం కుదురుకున్నాడు. కన్న కొడుకు ఏమైపోయాడోనని తన భార్య కన్నీరుమున్నీరవుతోందని, తాను పడుతున్న వేదన వర్ణనాతీతమని సదా తెలిపాడు.

కాట్మాండు చేరిన సదా, అతని తమ్ముడు.. వినోద్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఉత్తర నేపాల్ నుంచి వరద బాధితులను చాలా మందిని హెలికాప్టర్లలో అక్కడికి తీసుకువచ్చారు. శవాగారం బయట ఉంచిన ఫోటోలను చూసి గుర్తుపట్టడం ఎవరికైనా చాలా కష్టం. దొరుకుతున్న శవాలన్నీ కుళ్ళిపోయి లేదా ఛిన్నాభిన్నమై ఉన్నాయి. ఎక్కడా వినోద్ ఆచూకీ దొరకలేదు. ఆస్పత్రుల్లోని జాబితాలో అతని పేరు కానీ, ఫోటో కానీ ఎక్కడా కనిపించలేదు.

అధికారుల ఉదాసీనత.. వివక్ష ఆవేదన

ఖ్లాట్మండు నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నువాకోట్ వైపు సదా నడక మొదలుపెట్టాడు. తన కొడుకు పని చేసిన త్రిశూలి జల విద్యుత్ కేంద్రానికి   చేరుకున్నాడు. అయితే అక్కడ అధికారులు అతని గోడు వినలేదు తమను పట్టించుకోలేదని ఆరోపించాడు. కుల, ప్రాంతీయ వివక్షే ఇందుకు కారణమని  సదా అంటున్నాడు.  “పోలీస్ స్టేషన్లు, ఆర్మీ క్యాంపులు అని తేడా లేకుండా అన్ని చోట్లా పేర్లు ఇచ్చాం. అయినా సరే మాకు ఎవరూ సాయం చేయడం లేదు. మేం మధేసీలం, బిహారీలం అని తక్కువగా చూస్తారు. మాకు సరిగ్గా నేపాలీ మాట్లాడటం రాదు.. అందుకే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎటు పడితే అటు తిప్పుతున్నారు” అంటూ సదా ఆగ్రహించాడు. “నా కొడుకు శవం దొరికినా సరే, దాన్ని కళ్ళారా చూసే హక్కు మాకు ఉంది,” అని తెలిపాడు.
అయితే త్రిశూలి సొరంగం బయట నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌తో పాటు భారత్, చైనా దేశాల నుంచి వచ్చిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ నిపుణులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 

Loading...
Unable to load recommendations.
Follow Us