Telangana: అమ్మ అనాథ గా మారింది.. గెంటివేసిన పిల్లలు.. ఆదరించిన పోలీసులు..!

| Edited By: Balaraju Goud

Aug 16, 2024 | 1:00 PM

అమ్మ అనాథ గా మారింది..! కొడుకులు ఉన్నా.. అన్నం పెట్టలేదు. ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వలేదు. వంతులు వేసుకుని పోషణకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు భరోసా కల్పించారు ఆ అమ్మకు..!

Telangana: అమ్మ అనాథ గా మారింది.. గెంటివేసిన పిల్లలు.. ఆదరించిన పోలీసులు..!
Police Took Care
Follow us on

అమ్మ అనాథ గా మారింది..! కొడుకులు ఉన్నా.. అన్నం పెట్టలేదు. ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వలేదు. వంతులు వేసుకుని పోషణకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు భరోసా కల్పించారు ఆ అమ్మకు..! ఆస్తిని పంచుకున్న అన్నదమ్ములిద్దరూ అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా వంతులు వేసుకున్నారు. గడువు ముగిసిందని ఓ కొడుకు ఇంటినుండి వెల్లగొడ్తే.. తల్లిని చూసుకోవల్సి వస్తుందని మరో కొడుకు ఇంటికే తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. అందరూ ఉన్నా అనాథగా మారిన ఆ అమ్మ గురించి తెలుసుకున్న పోలీస్ ఇన్స్‌పెక్టర్ సదన్ కుమార్ రంగంలోకి దిగారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది. గ్రామానికి చెందిన వడ్లూరి మల్లమ్మ(75)కు ఇద్దరు కొడుకులు. వంతుల వారిగా బాగోగులు చూసుకోవాలని పిల్లలు భావించారు. తండ్రి మరణించిన తరువాత వారి ద్వారా సంక్రమించిన ఆస్తిని వాటాలుగా పంచుకున్న తనయులు తల్లిని చూసుకునేందుకు వంతులు వేసుకున్నారు. దీంతో బుధవారం(ఆగస్ట్ 15) తల్లి తన వద్ద ఉండేందుకు గడువు ముగిసిందని తన ఇంటి నుంచి పంపించి మరో కొడుకు వద్దకు వెళ్లాలని చెప్పాడు.

అయితే ఆయన తన ఇంటికి తాళం వేసుకుని వేరే చోటకు వెళ్ళిపోయాడు. దీంతో మల్లమ్మను ఎవరు చూసుకుంటారో అర్థం కాకుండా పోయింది. చివరకు తండ్రి ఫోటోను కూడా బయట విసిరేసిన తనయుడి తీరును చూసిన తల్లి కన్నీటి పర్యంతం అయింది. ఈ విషయం తెలుసుకున్న మానకొండూరు సీఐ సదన్ కుమార్ బుధవారం సాయంత్రం మల్లమ్మ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తిరిగి గురువారం నాడు గ్రామానికి వెళ్ళిన సీఐ తాళం వేసి ఉన్న ఇంట్లో మల్లమ్మను దించాడు. బాగోగులు చూసుకోకపోతే తనకు సమాచారం అందించాలని సూచించారు. తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకున్న కొడుకులు తల్లిని చూసుకోకపోవడం ఏంటని సీఐ తనయులిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను చూసుకోలేకపోతే మల్లమ్మకు తాను అండగా నిలుస్తానని, ఆమె ఖర్చులు కూడా భరిస్తానని మాట ఇచ్చారు.

వీడియో చూడండి..

 

సీనియర్ సిటిజన్స్ యాక్ట్…

తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని కొడుకులపై సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు మానకొండూరు సీఐ సదన్ కుమార్ తెలిపారు. పేరెంట్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. నవమాసాలు పెంచి పోషించిన తల్లి బాగోగులు చూసేందుకు వివక్ష చూపుతున్న తీరు సరికాదన్నారు. అమ్మకు బుక్కెడు అన్నం పెట్టడానికి వంతులు వేసుకున్న కొడుకులను కనేటప్పుడు కానీ, పెంచి పెద్ద చేసేటప్పుడు కానీ మీ తల్లి వంతులు వేసుకుందా అని ప్రశ్నించారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చూపితే ఊరుకునేదీ లేదన్నారు సీఐ సదన్. తనయులు ఇద్దరు పంచుకున్న ఆస్తి కూడా తండ్రి ద్వారా సంక్రమించిందే కాబట్టి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆస్తులపై మల్లమ్మకే హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకుని ఆమె జీవితానికి భరోసా కల్పిస్తామని సీఐ సదన్ కుమార్ స్పష్టం చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..