జీవితమే నాటక రంగం అంటారు. కానీ కొందరు కళాకారులకు నాటకమే జీవితం. వారు నటనే తమ ఊపిరిగా భావిస్తారు. నాటకంలోని తమ పాత్రను పండించడానికి ప్రాణం పెడతారు. అలా ఓ వ్యక్తి స్టేజ్‌పై నాటకం వేస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతను చేసిన పాత్ర కూడా అలాంటిదే కావడంతో అది నటనే అనుకున్నారు ప్రేక్షకులు.. తమ కరతాళ ధ్వనులతో అతడిని అభినందించారు.. కానీ అతను ఎంతకీ లేవలేదు. అప్పుడే అసలు విషయం తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ లో రామాయణానికి సంబంధించిన నాటకం వేస్తున్నారు. ఈ నాటకంలో రాజేంద్ర కశ్యప్ అనే 62 ఏళ్ల వ్యక్తి దశరథుడి పాత్రలో నటించాడు. ఆ రాముడిని 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్లాలని చెప్పే ఘట్టంలో ఆయన డైలాగులు చెబుతున్నారు. ఈపాత్రలో భాగంగా రాముడి వనవాసం మాట వినగానే అతడు వేదికపై కుప్పకూలాల్సి ఉంటుంది. ఆ మాట విన్న వెంటనే ఆయన పడిపోయాడు. ఈసారి ఆయన నాటకంలో భాగంగా పడిపోలేదు. అస్వస్థతతో కుప్పకూలిపోయాడు. ఆ విషయం ప్రేక్షకులు గుర్తించలేకపోయారు. నాటకంలో భాగంగానే ఆయన పడిపోయాడని భావించి, అద్భుతంగా నటించాడంటూ క్లాప్స్ కొట్టారు. ఎంత సేపటికీ ఆయన లేవకపోవడంతో ఆయనను లేపే ప్రయత్నం చేశారు. అప్పుడు అసలు విషయం అర్థం అయ్యింది. ఆయన నిజంగానే మృతి చెందాడని తెలుసుకున్న ప్రేక్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నాటకంలో భాగంగానే పడిపోయాడని అనుకున్నామని, ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారని రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు సంజయ్ సింగ్ గాంధీ చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. వేదికపై నాటకం వేస్తోన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడని తెలిపారు. రాజేంద్ర కశ్యప్‌ను ఆసుపత్రికి తరలించినప్పకీ లాభం లేకుండాపోయింది. ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కశ్యప్ రెండు దశాబ్దాలుగా రామాయణ నాటకాల్లో పాత్రలు వేస్తూ ప్రేక్షకులను అలరించాడు.
Also Read: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ