
ప్రస్తుత కాలంలో వంట గ్యాస్ (LPG) లేని ఇల్లు అంటూ లేదు.. ఎక్కడో మారుమూల ప్రాంతాలు మినిహా దాదాపు ప్రతి ఒక్కరూ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగిస్తున్నారు. అయితే.. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల అనేవి గృహ వినియోగదారులకు పెద్ద సవాలుగా మారిన విషయం తెలిసిందే.. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది.. వంటగ్యాస్ ఈజీగానే లభ్యమవుతోంది. అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. ఎప్పుడూ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా.. మనం వంట చేసుకునేటప్పుడు.. అలాగే కొన్ని పరిస్థితుల్లో గ్యాస్ ఆదా చేసుకోవడం ద్వారా ఒక సిలిండర్‌ను ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఇక్కడ కొన్ని సమగ్ర చిట్కాలను ఈ కథనంలో వివరించడం జరిగింది.. అవేంటో తెలుసుకుందాం..
వంటగ్యాస్ పొదుపులో మొదటి అడుగు మీ స్టవ్, బర్నర్లను శుభ్రంగా ఉంచుకోవడం. పాలు పొంగినప్పుడు, టీ చిమ్మినప్పుడు బర్నర్ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది మంటను అడ్డుకొని గ్యాస్‌ను వృధా చేస్తుంది. బర్నర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల మంట సమర్థవంతంగా వెలువడుతుంది. అలాగే, గ్యాస్ లీకేజీని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. పైపు, రెగ్యులేటర్‌ల కనెక్షన్లను గమనిస్తూ ఉండాలి. చిన్న మంట వస్తున్నా, గ్యాస్ లీకవుతుందనడానికి అది సూచన కావచ్చు.
వంట ప్రారంభించే ముందు అవసరమైన అన్ని పదార్థాలను (కట్ చేసిన కూరగాయలు, ఉల్లిపాయలు, పప్పులు మొదలైనవి) సిద్ధంగా ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి, ఆ తర్వాత ఏం వండాలి, ఏం తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తే అనవసరంగా గ్యాస్ వృథా అవుతుంది. వంటను ప్లాన్ చేసుకోవడం ద్వారా ఈ వృథాను నివారించవచ్చు.
పప్పులు, బియ్యం, చిక్కుళ్ళు వంటి వాటిని వండడానికి అరగంట ముందు నీటిలో నానబెట్టడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. దీనివల్ల వంట సమయం గణనీయంగా తగ్గి, గ్యాస్ ఆదా అవుతుంది.
కుక్కర్‌లో వండటం గ్యాస్ ఆదాకు అత్యుత్తమ మార్గాలలో ఒకటి. బియ్యం, పప్పులు, కూరగాయలు, చికెన్, మటన్ వంటివి కుక్కర్‌లో వండటం వల్ల వంట సమయం చాలా వరకు తగ్గిపోతుంది. ఇది గ్యాస్‌ను ఆదా చేయడమే కాకుండా, పోషకాలను కూడా నిలుపుతుంది.
వంట పాత్ర పరిమాణానికి తగిన బర్నర్‌ను ఉపయోగించాలి. చిన్న గిన్నెకు పెద్ద బర్నర్‌ను వాడితే, మంట పాత్ర అంచులకు వెళ్ళి వృధా అవుతుంది. చిన్న పాత్రలకు చిన్న బర్నర్, పెద్ద పాత్రలకు పెద్ద బర్నర్‌ను వాడటం ద్వారా మంట సమర్థవంతంగా పాత్ర అడుగు భాగానికి తగిలి వంట త్వరగా పూర్తవుతుంది.
వంట చేసేటప్పుడు పాత్రలపై మూత పెట్టడం చాలా ముఖ్యం. మూత పెట్టడం వలన లోపల ఆవిరి ఉండి, ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
ఫ్రిడ్జ్ నుండి తీసిన పాలు, కూరగాయలు, ఇతర పదార్థాలను వెంటనే స్టవ్ మీద పెట్టకూడదు. వాటిని కాసేపు బయట ఉంచి, రూమ్ టెంపరేచర్‌కు వచ్చిన తర్వాత వంట ప్రారంభించాలి. చల్లని పదార్థాలను వేడి చేయడానికి ఎక్కువ గ్యాస్ అవసరం అవుతుంది.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్: అన్నం, పప్పులను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండుకోవచ్చు. బియ్యం నానబెట్టి వండటం ద్వారా ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. వెజిటబుల్ రైస్, పులావ్ వంటివి కూడా ఇందులో తయారు చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ కెటిల్: నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ కెటిల్‌ను ఉపయోగించవచ్చు. వేడి నీటిని సేమియా ఉప్మా, కూరలు, పానీయాలలో వాడటం వల్ల వంట వేగంగా పూర్తై గ్యాస్ ఆదా అవుతుంది.
డీప్ ఫ్రై వంటకాలకు ఎక్కువ సమయం పడుతుంది.. ఎక్కువ గ్యాస్ వినియోగం ఉంటుంది. గ్యాస్ కొరత ఉన్నప్పుడు డీప్ ఫ్రై వంటి వంటకాలకు వీలైనంతవరకు దూరంగా ఉండటం మంచిది.
ఈ చిన్న చిన్న మార్పులను రోజువారీ వంట పనులలో అమలు చేయడం ద్వారా ఒక కుటుంబం గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని ఒక నెలకు బదులుగా ఒకటిన్నర నెలల వరకు పొడిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలు వంటగ్యాస్‌ను ఆదా చేయడంలో ఎంతగానో సహాయపడటంతోపాటు.. ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తాయని పేర్కొంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..