100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప దీనికి చావు లేదు!

సముద్రంలో అత్యంత దీర్ఘకాలం జీవించే జీవులు. ఇవి వృద్ధాప్యంతో చనిపోవని, 100 ఏళ్లకు పైగా బతకగలవని పరిశోధనలు చెబుతున్నాయి. టెలోమెరేజ్ ఎంజైమ్ వాటి దీర్ఘాయుష్షుకు, నిరంతర ఎదుగుదలకు కారణం. అయితే, ఇవి అమరజీవులు కావు. పాత కవచాన్ని మార్చుకునే (మోల్టింగ్) సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, వేటగాళ్లు, వ్యాధులు వాటి మరణానికి ప్రధాన కారణాలు.

100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప దీనికి చావు లేదు!
Lobster Lifespan Secrets

Updated on: Jul 20, 2026 | 5:40 PM

ఈ భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. మనిషి ఇంకా కనిపెట్టని చిత్రవిచిత్రమైన జీవులు కూడా చాలా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా సముద్ర గర్భంలో అంతచిక్కని జీవాలు చాలా ఉన్నాయనే విషయాలు శాస్త్రవేత్తలు పలు మార్లు చెప్పి ఉన్నారు. అయితే మనుషులు కనిపెట్టిన కొన్ని జీవుల్లో అంతపట్టని రహస్యాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సముద్ర జీవుల్లో అత్యంత ఆసక్తికరమైన జీవులలో ఎండ్రకాయలు (Lobsters) ఒకటి. ఇవి ఎంతకాలం జీవిస్తాయి? నిజంగానే వృద్ధాప్యంతో చనిపోవా? 100 ఏళ్లకు పైగా బతకగలవా? అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. ఈ అంశాలపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు నిర్వహించగా, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫొటో: సముద్రంలో ఎండ్రకాయ

140 ఏళ్ల వయసు..

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. సాధారణంగా సముద్ర ఎండ్రకాయల సగటు జీవితకాలం 30 నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే అనుకూల వాతావరణం, తగిన ఆహారం, వేటగాళ్ల నుంచి రక్షణ లభిస్తే కొన్ని ఎండ్రకాయలు 80 నుంచి 100 సంవత్సరాల వరకు కూడా జీవించే అవకాశం ఉంది. మరికొన్ని భారీ పరిమాణంలో ఉన్న అమెరికన్ ఎండ్రకాయల వయస్సు 110 నుంచి 140 సంవత్సరాల వరకు ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lungfish: 4 ఏళ్లు ఇంచు కూడా కదలకుండా సమాధిలో జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!

మనుషులు లేదా చెట్లలో కనిపించేలా ఎండ్రకాయల్లో వయస్సును లెక్కించడానికి స్పష్టమైన గుర్తులు ఉండవు. అందువల్ల వాటి శరీర పరిమాణం, బరువు, ఎదుగుదల వేగం వంటి అంశాల ఆధారంగా మాత్రమే శాస్త్రవేత్తలు వయస్సును అంచనా వేస్తారు. అందుకే 100 ఏళ్లు దాటిన ఎండ్రకాయల గురించి చెప్పే వివరాలు ఎక్కువగా శాస్త్రీయ అంచనాలుగానే పరిగణించబడుతున్నాయి. ఎండ్రకాయలు ఎక్కువకాలం జీవించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాటి శరీరంలో టెలోమెరేజ్ అనే ఎంజైమ్ అధికంగా పనిచేయడం. సాధారణంగా చాలా జీవుల్లో వయస్సు పెరిగేకొద్దీ కణాలు దెబ్బతింటాయి. కానీ ఎండ్రకాయల్లో ఈ ఎంజైమ్ కణాల పునరుద్ధరణకు కొంతవరకు సహాయపడుతుంది. అందువల్ల ఇవి చాలా కాలం పాటు ఎదుగుతూ, పెద్ద పరిమాణాన్ని చేరుకుంటాయి.

ఫొటో: సముద్రంలో ఎండ్రకాయ

బతికినంత కాలం పెరుగుతూనే ఉంటాయి..

అయితే ఎండ్రకాయలు అమరజీవులు కావు. వయస్సు పెరిగేకొద్దీ వాటి భారీ సైజ్ శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఎండ్రకాయలు పెరగడానికి తరచూ తమ పాత గట్టి కవచాన్ని తొలగించి కొత్త కవచాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మోల్టింగ్ అంటారు. వయస్సు పెరిగిన తర్వాత ఈ ప్రక్రియ చాలా కష్టంగా మారుతుంది. శక్తి తగ్గడం, కొత్త కవచం సరిగా ఏర్పడకపోవడం వంటి కారణాల వల్ల అవి బలహీనపడే అవకాశం ఉంటుంది. అంతేకాదు సముద్రంలోని పెద్ద చేపలు, ఆక్టోపస్‌లు వంటి వేటగాళ్లు, వ్యాధులు, నీటి కాలుష్యం, ఆక్సిజన్ కొరత, ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు కూడా ఎండ్రకాయల మరణానికి కారణమవుతాయి. అందువల్ల అనుకూల పరిస్థితులు లేకపోతే అవి 100 ఏళ్ల వరకు జీవించడం సాధ్యం కాదు.

ఇది కూడా చదవండి: Copperhead Snake: దీని వేటాడే స్టైలే వేరు! మనుషులే టార్గెట్‌గా ఇళ్ల చుట్టుపక్కలే తిరుగుతూ..

అయితే కొన్నిసార్లు పాత షెల్ నుంచి బయటికి రాలేక అవి కన్నుమూస్తూ ఉంటాయి. ఇది ఒకరకంగా వాటికి వచ్చే అపాయమే కానీ, వయసుతో వచ్చే మరణం కాదు. వేట, అపాయం కారణంగానే ఈ ఎండ్రకాయలు మరణిస్తూ ఉంటాయి. సహజ మరణం అనేది చాలా తక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. సముద్ర జీవులలో అత్యధిక కాలం జీవించే జాతుల్లో ఎండ్రకాయలు ఒకటిగా గుర్తింపు పొందాయి. వాటి దీర్ఘాయుష్షు, జీవితాంతం పెరుగుతూ ఉండే స్వభావం, ప్రత్యేక జీవశాస్త్ర లక్షణాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ జీవులపై మరిన్ని పరిశోధనలు జరిగితే, వృద్ధాప్యం, కణాల పునరుత్పత్తికి సంబంధించిన కొత్త శాస్త్రీయ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us