N V Ramana : 55 ఏళ్ల తర్వాత…అవును అర్ధశతాబ్దం తర్వాత మరో తెలుగుతేజానికి న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి దక్కింది. జస్టిస్ నూతలపాటి వెంకటరమణని సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈనెల 24న ప్రమాణస్వీకారం చేయబోతున్న జస్టిస్ ఎన్వీ రమణ.. 2022 ఆగస్టు 26దాకా..16నెలల పాటు సుప్రీం చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతారు.
జస్టిస్ నూతలపాటి వెంకటరమణ స్వస్థలం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లో దిట్టనే పేరు తెచ్చుకున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన ఎన్వీ రమణ.. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఎన్వీ రమణ.. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరి 17న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఎన్వీ రమణకు తెలుగుభాషపై ఎనలేని మమకారం. అందుకే రాష్ట్ర న్యాయవ్యవస్థలో తెలుగు అమలుకు ఎంతో కృషిచేశారు. జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు..అధికార భాషా సంఘంతో కలిసి సెమినార్ నిర్వహించారు. తెలుగుగడ్డపై పుట్టి…ఇక్కడే ఒక్కో మెట్టూ ఎదిగి.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తున్న తెలుగు తేజాన్ని చూసి ఈ నేల గర్విస్తోంది. ఎప్పుడో 1966లో సుప్రీం చీఫ్ జస్టిస్ పదవి చేపట్టిన తొలి తెలుగువారైన కోకా సుబ్బారావు తరువాత.. మళ్లీ ఇన్నేళ్లకి ఆ పదవి చేపట్టబోతున్నారు జస్టిస్ NV రమణ.