మనం మాయమైపోతామా..? డైనోసార్లలా అంతరించిపోతామా.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

|

Jun 06, 2024 | 11:18 AM

మనం మాయమైపోతామా... ? డైనోసార్లలా అంతరించిపోతామా..? భవిష్యత్తులో ఈ భూమ్మీద బతికే జీవులు మనుషులు ఇలా ఉండేవారని బిగ్ స్క్రీన్‌లపై మనం డైనోసార్లను చూసినట్టు చూసుకోవాల్సిందేనా..? తాజాగా విడుదలైన జనన గణాంకాల నివేదిక... ఎందుకు.. ఈ తరానికి అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే చెబుతా.. బర్త్ రేట్ ఇండెక్స్‌ను చూస్తే ఇది భవిష్యత్తులో నిజం కానుందా అన్న అనుమానం రాక మానదు.

మనం మాయమైపోతామా..? డైనోసార్లలా అంతరించిపోతామా.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Birth Rate Index
Follow us on

మనం మాయమైపోతామా… ? డైనోసార్లలా అంతరించిపోతామా..? భవిష్యత్తులో ఈ భూమ్మీద బతికే జీవులు మనుషులు ఇలా ఉండేవారని బిగ్ స్క్రీన్‌లపై మనం డైనోసార్లను చూసినట్టు చూసుకోవాల్సిందేనా..? కొద్ది రోజుల క్రితం విడుదలైన బర్త్ రేట్ ఇండెక్స్‌ను చూస్తే ఇది భవిష్యత్తులో నిజం కానుందా అన్న అనుమానం రాక మానదు.

ఎక్కడి వరకో ఎందుకు… మన ఆసియాలో మనకు దగ్గర్లోనే ఉన్న దక్షిణ కొరియా తెలుసు కదా.. అభివృద్ధిలో ఆకాశంతో పోటీ పడే ఈ దేశం.. జననాల విషయంలో మాత్రం రోజు రోజుకీ అథఃపాతాళానికి దిగజారిపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న విడుదలైన గణాంకాలను చూస్తే 2022తో పోల్చితే 2023లో ఏకంగా 8శాతం నుంచి 0.72 శాతానికి జననాల రేటు పడిపోయింది. ఏ దేశమైనా స్థిరమైన వృద్ధి రేటు కొనసాగించాలంటే కనీసం జననాల రేటు 2.1శాతం ఉండాలి. దక్షిణ కొరియాలో ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి కొరియా జనాభా ప్రస్తుతమున్న సంఖ్యలో సగానికి తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు ఆ దేశం అంత ఆందోళన చెందుతోంది.

ఇది కేవలం దక్షిణ కొరియాకు మాత్రమే పరిమితం కాలేదు. పక్కనే మరో సూపర్ పవర్ కంట్రీ జపాన్‌లోనూ అదే పరిస్థితి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏకంగా 5.1 శాతం పడిపోయింది. పెళ్లిళ్ల సంఖ్య కూడా అంతే. సంవత్సరం మొత్తంలో జపాన్‌లో కేవలం 4లక్షల 89 వేల 281 వివాహాలు మాత్రమే జరిగాయి. ఇంత దారుణంగా పడిపోవడం గత 90 ఏళ్లలో ఇదే మొదటిసారి. వరుసగా 8 వ ఏడాది కూడా జననాల రేటు పడిపోయింది. జనాభా శరవేగంగా పడిపోతున్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి. మున్ముందు ఇది మరింత ప్రమాదకర స్థాయిని చేరుతుందన్నది అక్కడ నిపుణుల మాట.

Declining of Human Birth Rate

చైనా… నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. కానీ ఆ దేశంలో జననాల రేటు గత కొన్నేళ్లుగా పడిపోతూ రావడం అక్కడ పాలకుల్ని తీవ్ర ఆందోళనకు నెట్టేస్తోంది. ఒ రకంగా కొన్నేళ్ల క్రితం వరకు అమల్లో ఉన్న వన్ చైల్డ్ వన్ ఫ్యామెలీ విధానమే దీనికి కారణం అన్న వారు లేకపోలేదు. దాంతో 2015 నుంచి ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతిచ్చింది చైనా సర్కారు. ఆ తర్వాత 2021 నాటికి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో ముగ్గుర్ని కనడానికి కూడా అనుమతులు జారీ చేసింది. అయినా సరే తాజాగా విడుదల గణాంకాల ప్రకారం అక్కడ జననాల రేటు వరుసగా ఏడో ఏడాది కూడా దిగజారింది. 2022లో 95 లక్షల జననాలు ఉండగా… 2023 నాటికి 90 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం జరిగిన చైనా న్యూ ఇయర్ వేడుకల్లో మాట్లాడిన సింగపూర్ ప్రధాని… పెళ్లయిన జంటలు కెరిర్ వైపు పరిగెత్తడం కాసేపు పక్కనపెట్టి.. పిల్లలు కనడం గురించి కూడా ఆలోచించాలని యువతకు సూచించారు. ఫ్యామెలీ లైఫ్‌లో పిల్లల్ని కనడం, వారిని పెంచడం, ప్రయోజకుల్ని చెయ్యడం , మన తరాల సంస్కృతి సంప్రదాయాలను మరో తరానికి అందించడం ఇవి కూడా భాగమేనని.. కనుక యువత ఆ విషయంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. లిటిల్ డ్రాగన్లను తీసుకొచ్చి.. తమలాంటి తాతలకు ఆడుకునే అవకాశం ఇవ్వాలంటూ యువతనుద్ధేశిస్తూ చెప్పుకొచ్చారు. ఆయన అలా చెప్పడానికి కారణం అక్కడ కూడా రోజు రోజుకు పుట్టుకలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది మరీ దారుణంగా సింగపూర్లో జననాల రేటు 0.97 శాతానికి పడిపోయింది.

Declining of Human Birth Rate

ఫ్రాన్స్‌లో అయితే మరింత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 2023లోనే అత్యల్ప జననాల రేటు అక్కడ నమోదైంది. ఇక మరణాల రేటు మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 68.4 మిలియన్ల జనాభా ఉన్న ఫ్రాన్స్‌లో ఒక్క 2023 సంవత్సరంలోనే సుమారు 6లక్షల 31 వేల మరణాలు సంభవించాయి. ఇదే ఇప్పుడు ఆ దేశాన్ని కూడా ఆందోళనలోకి నెట్టేస్తోంది. మన దేశానికొస్తే.. ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా మనదే. మిగిలిన దేశాలతో పోల్చితే యువత కూడా ఎక్కువగా ఉన్నది కూడా మన దేశంలోనే. అయితే మన దగ్గర కూడా జననాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 2022 పోల్చితే 2023 తగ్గింది. ఆ తగ్గుదల అలాగే కొనసాగుతోంది కూడా..

ఈ సమస్య కేవలం ఆసియా దేశాల్లోనే కాదు.. చాలా దేశాల్లో ఈ మధ్య పెరుగుతూ వస్తోంది. కారణం కెరీర్‌పై ఉన్న ఆసక్తి ….ఈ మధ్య కాలంలో పిల్లలు కనడంపై ఉండటం లేదన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లకపోవడాన్ని ఫెల్యూర్‌గానే భావిస్తారు. దాంతో పాటు అదనపు పని గంటలు కూడా వాళ్లకు పెద్ద భారం. ఇంటికొచ్చాక.. ఇంటి పనులు, వ్యాయామానికి ఇచ్చినంత ప్రాధాన్యం పిల్లలు కనడానికి ఇవ్వటం లేదన్నది నిపుణుల మాట. అదే సమయంలో కెరీర్లో రాణించకపోతే వాళ్లకు విలువ ఉండదని, అందుకే తాము పిల్లలు కనడం కన్నా కెరీర్ గురించే ఎక్కువ ఆలోచిస్తామంటున్నారు ఆ దేశస్థులు. దీంతో జనాభాను పెంచేందుకు అక్కడ ప్రభుత్వాలు భారీగా బహుమతులు ప్రకటిస్తున్నాయి. ముగ్గురు కన్నా ఎక్కువ పిల్లలుంటే వారిని సైన్యం నుంచి తప్పిస్తున్నారు కూడా. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జననాల రేటులో ప్రస్తుతం అక్కడ పెద్ద మార్పు కనిపించడం లేదు.

Declining of Human Birth Rate

ఇక మన దగ్గర కూడా అదే పరిస్థితి. ఈ మధ్య కాలంలో యువతీ-యువకులిద్దరూ ఉద్యోగాలు చేస్తూన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. అదే సమయంలో పెళ్లి, పిల్లలు కన్నా కెరీర్‌లో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో ఉన్న వారి సంఖ్య గత కొన్నేళ్లుగా చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో వివాహం ఆలస్యం కావడం… ఆ తర్వాత కొంత కాలం పిల్లలు కనడానికి సమయం తీసుకోవడం.. అప్పటికే వారి వయసు 35 ఏళ్లు దాటిపోవడంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతోంది. అయితే మన దేశంలో పరిస్థితి ఇంకా దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, చైనా అంత దిగజారలేదు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే… ప్రస్తుతం 2.3 శాతంగా ఉన్న జనననాల రేటు 2100 సంవత్సరం వచ్చేసరికి 1.82 శాతానికి పడిపోతుందని అంచనాలు చెబుతున్నాయి.

సో.. అదీ సంగతి. ఈ ప్రభావం ఇప్పటికిప్పుడు కనిపిస్తుందా.. అంటే కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్‌ను మాత్రం కచ్చితంగా ప్రమాదంలో పడేస్తుంది. అందుకే ఆయా దేశాలు పిల్లల్ని కనండంటూ చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాయి. కన్న వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటామని హామీలిస్తున్నాయి. ఒక వేళ వాళ్లు అనుకున్నట్టు జరగకపోతే… ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి.. ప్రమాదం ముంచుకొస్తే.. ముందే చెప్పినట్టు.. భవిష్యత్తులో మనల్ని కూడా డైనోసార్లను చూసినట్టే టీవీల్లో, సినిమాల్లో చూడాల్సిన పరిస్థితే వస్తుందేమో..!

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..