చలికాలం దాదాపు మొదలైనట్లే. ఈ కాలంలో దగ్గు, జలుబు సర్వసాధారణం. చాలా మంది దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటూ ఉంటారు. మరికొందరు చలికాలంలో రాత్రిపూట బ్రాందీ లేదా రమ్ తాగితే.. దగ్గు, జలుబు నయం అవుతుందని వీటిని సేవిస్తూ ఉంటారు. నిజానికి శీతాకాలంలో ఆల్కహాల్ సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అనడానికి ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. దీనిలో అసలు నిజమెంత ఉందో.. నిపుణులు ఏం చెబుతున్నారో.. ఇక్కడ తెలుసుకుందాం.
మద్యం ప్రియులు ఇష్టంగా సేవించే రమ్‌ను… వాస్తవానికి చెరకుతో తయారు చేస్తారు. అయితే బ్రాందీని తయారు చేయడానికి మాత్రం వివిధ రకాల పండ్ల రసాలు, డిస్టిల్డ్ వైన్‌ను ఉపయోగిస్తారు. చలికాలంలో ప్రతిరోజూ సాయంత్రం పూట దీన్ని తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందని భావిస్తారు. అందుకే విదేశాల్లో సైతం సాయంత్రం వేళల్లో మద్యం సేవిస్తూ ఉంటారు.కొంతమంది మద్యం వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా బ్రాందీ, రమ్ వంటి మద్యం రకాలు.. జలుబు, దగ్గుతో పాటు కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్‌ను కూడా నయం చేస్తాయని విశ్వసిస్తారు. దీంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు. కొంతమంది ఇది శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంటారు. మద్యంలోని తాపజనక లక్షణాలు వీటిని నయం చేయడంతో దోహదపడుతుందని అంటుంటారు.
సైన్స్ ప్రకారం ఆల్కహాల్ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అంటే ఆల్కహాల్ సేవించిన తర్వాత అది శరీర వేడిని మరింత వేచ్చగా మారుస్తుంది. కానీ ఇది వ్యాధులను నయం చేస్తుందనే వాదనలు మాత్రం పూర్తిగా నిరాధారమైనవి. ఎందుకంటే ఆల్కహాల్ శరీరానికి అన్ని విధాలుగా హానికరం అని వైద్యులు సైతం చెబుతుంటారు. అది రమ్, బ్రాందీ ఏ బ్రాండ్ అయినా.. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని క్రమంగా బలహీనపరుస్తాయి. ఫలితంగా ఉన్న రోగాలు నయం చేయకపోగా కొత్త రోగాలు పుట్టుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.