Interesting Marriages: పెళ్లి చేసుకోవాలంటే సన్యాసం తీసుకోవాల్సిందే.. వివాహాల్లో వింతలు తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..

పెళ్లి అంటే చాలు బోలెడు సంప్రదాయాలు. మాకీ పట్టింపు లేదండీ అని ఆడపెళ్ళి వారు అంటే.. మా పద్ధతి ఇదేనండీ అని మగ పెళ్ళివారు యాగీ చేయడం చూస్తూనే ఉంటాం.

Interesting Marriages: పెళ్లి చేసుకోవాలంటే సన్యాసం తీసుకోవాల్సిందే.. వివాహాల్లో వింతలు తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..
Interesting Marriages

Updated on: Nov 14, 2021 | 11:55 AM

Interesting Marriages: పెళ్లి అంటే చాలు బోలెడు సంప్రదాయాలు. మాకీ పట్టింపు లేదండీ అని ఆడపెళ్ళి వారు అంటే.. మా పద్ధతి ఇదేనండీ అని మగ పెళ్ళివారు యాగీ చేయడం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. అబ్బే భోజనాల్లో నాన్ వెజ్ లేకపోతే కుదరదండి అని అబ్బాయి తరఫు వారు అంటే.. మా ఇంటా వంటా పెళ్ళిళ్ళలో పప్పన్నం పెట్టడం తప్ప మాంసం ముక్కలు పెట్టడం అలవాటు లేదు అని ఆడ పెళ్ళివారు కరాఖండీ చెబుతారు. ఇలా వివాహం అనేసరికి పద్ధతుల వివాదాలు తప్పనిసరి. అసలు ప్రపంచంలో మొదటి పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలుసా? దాదాపు 4,350 సంవత్సరాల క్రితం మెసొపొటేమియాలో జరిగినట్టు సాక్ష్యం ఉంది. ఇక్కడే తొలిసారిగా స్త్రీ, పురుషులను కలిపే వేడుక జరిగింది. ఇక మన దేశం విషయానికి వస్తే.. సీతారాముల స్వయంవరం.. దుష్యంత శాకుంతల గాంధర్వ వివాహం ఇలా చాలానే చెప్పుకుంటాం. మన సంప్రదాయంలో పెళ్లి వేల ఏళ్ల నుంచి ఉందని ఇవి చెబుతాయి. అంతేకాదు.. మన పెళ్ళిళ్ళలో ఎన్నో రకాలు ఉన్నాయనీ పురాణాలు చెబుతాయి.

సరే, అదంతా పక్కన పెట్టేస్తే.. మన దేశంలో వివాహాలకు సంబంధించి చాలా ఆచారాలు ఉన్నాయి. మనకు తెలిసినవి ఓ పదో..పరకో ఉంటాయేమో కానీ, చాలా మందికి తెలియని కొన్ని వింత సంప్రదాయాలు కూడా ఉన్నాయి. పెళ్లిళ్లకు సంబంధించి అలాంటి 8 ఆసక్తికరమైన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వరుడికి  టమోటాలతో స్వాగతం..

సాధారణంగా మీరు పెళ్లి ఊరేగింపులను హారతి.. పూలతో స్వాగతించడం మీరు విని ఉండాలి. అందరికీ అలాంటి స్వాగతం లభిస్తుంది అనుకోవద్దు. ఉత్తరప్రదేశ్‌లోని సర్సాల్‌లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో పెళ్లికొడుకు ఊరేగింపుకు టమోటాలతో స్వాగతం పలికుతారు. టమోటాలు మాత్రమే కాదు.. కొన్ని ఉపయోగించలేని పదార్ధాలు పెళ్ళికొడుకు స్వాగత కార్యక్రమంలో ఉపయోగిస్తారు. ఇది ఒక విధంగా సహనానికి పరీక్ష. అయితే, దీనిద్వారా ప్రారంభమైన సంబంధంలో లోతు ఉంటుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

2. పెళ్లికి ముందు వరుడు సన్యాసం తీసుకోవాలి..

పెళ్లి చేసుకోవాలా వద్దా అని భావించే యువత చాలా మంది ఉంటారు. తీరా యువకులు పెళ్లికి సిద్ధం అయితే, పెళ్ళికి ముందే ఆ యువకుడిని సన్యసించమని పెళ్లి కూతురు తరఫు వారు కోరతారు. ఇది విచిత్రమైన ఆచారం కాదంటారా? వివాహ వేడుకకు ముందు వరుడు సన్యాసిని కావాలని పట్టుబట్టడం తమిళ బ్రాహ్మణులలో ఆచారం. ఆ తర్వాత వధువు తండ్రి వెళ్లి వరునితో మాట్లాడతాడు. గృహస్థ జీవితం ఆవశ్యకత గురించి అతనికి చెప్పి, పెళ్లికి సిద్ధమైన అతన్ని మళ్లీ మండపానికి తీసుకువస్తారు. తమిళనాడు అనే కాదు.. దక్షిణ భారత దేశంలో కొన్ని వర్గాల్లో ఇటువంటి ఆచారం ఉంది. కొంతమంది వరుడిని బావమరిది వెళ్లి బ్రతిమాలి తీసుకు వస్తాడు. కొంతమంది దీనిని వరుడు కాశీకి పోవడం అనే పేరుతో పెద్ద వేడుకలా నిర్వహిస్తారు.

3. వధువు తన తలపై పాత్రలు ఉంచి ఆశీర్వాదం తీసుకోవడం..

ఈ ప్రత్యేకమైన ఆచారం బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. పెళ్లయ్యాక వధువు మొదటిసారిగా అత్తమామల ఇంటికి వస్తే అత్తగారు వధువు తలపై మట్టి కుండలు పెదుతుంది. ఈ పాత్రలతో పెద్దల ఆశీస్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఈ ఆచారం ఒక జోక్ కావచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం పాత్రలను బ్యాలెన్స్ చేయలేక మహిళ ఇబ్బంది పడాల్సి వచ్చేది.

4. వధూవరుల తల్లులు పెళ్లి చూడలేరు

ఏ పెళ్లిలోనైనా వధూవరుల తల్లి అత్యంత ఉత్సాహంగా ఉంటారు. కానీ వారు వివాహానికి హాజరుకాకుండా నిషేధించినట్లయితే? సాంప్రదాయ బెంగాలీ వివాహాలలో ఇది జరుగుతుంది. అక్కడ తల్లి తన కొడుకు లేదా కుమార్తె వివాహాన్ని చూడదు. నవ వధూవరుల జీవితంలో తల్లి ఉనికి చెడు ప్రభావాలను తెస్తుందని నమ్ముతారు. విచిత్రం కదా!

5. ముందు చెట్టు లేదా కుక్కతో వివాహం

దేశంలోని అనేక ప్రాంతాల్లో వధువు చెట్టును లేదా కుక్కను వివాహం చేసుకోవాల్సిన ఆచారం కూడా ఉంది. మాంగ్లిక్ అమ్మాయిని మొదట చెట్టు లేదా కుక్కతో వివాహం చేసుకోవడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీని తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఆడపిల్లలను కించపరిచే ఈ ఆచారం క్రమంగా తగ్గుతోంది.

6. వివాహం తర్వాత, భర్త..భార్య సంవత్సరం పాటు గదిలో బందీలుగా ఉండాలి..

కొత్తగా పెళ్లయిన జంట కొద్దిరోజులు ఒంటరిగా ఉండాలనుకుంటారు. అందుకే హనీమూన్ వగైరా ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్ని గిరిజన సమాజాల్లో భార్యాభర్తలు ఏడాది పాటు ఒంటరిగా జీవించడం ఆనవాయితీ. పెళ్లయ్యాక ఇద్దరినీ ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేస్తారు. వీరు ఆ ఏడాది అంతా ఎవరితోనూ కలవడానికి, మాట్లాడడానికి వీలులేదు. ఒక సంవత్సరం తర్వాత, గ్రామంలోని పెద్దలు పెళ్లికి ముద్ర వేస్తారు. దీని తరువాత, పెళ్లిని పెద్ద ఈవెంట్ నిర్వహించడం ద్వారా జరుపుకుంటారు. అంటే వీరు ఏడాది పాటు డేటింగ్ చేస్తారన్న మాట.

7. దండలు మార్చుకోవడం ద్వారా మాత్రమే వివాహం..

వివాహాలలో డజన్ల కొద్దీ ఆచారాలు ఉన్నాయి. సిద్ధం చేయడానికి..నిర్వహించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, అస్సాంలోని రభా గిరిజన సమూహంలో, వివాహం కోసం దండలు మాత్రమే మార్చుకుంటారు. అంతే పెళ్లి అయిపోతుంది. దీని తరువాత, కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ విందులో వధూవరులు మాత్రమే స్వయంగా వడ్డించాల్సి ఉంటుంది.

8. వరుడి ముక్కు,చెవులను గీయడం

పెళ్లిళ్లలో వరుడికి పూర్తి గౌరవం ఇస్తారు. అయితే, కొన్ని చోట్ల వరుడిని ఇబ్బంది పెట్టే ఆచారాలు ఉన్నాయి. మహారాష్ట్ర వివాహాల్లో, వధువు సోదరుడు వరుడి చెవిని లాగుతారు. గుజరాతీ వివాహాలలో, వధువు తల్లి వరుడి ముక్కును గీస్తుంది. ఈ ఆచారాలు హాస్యాస్పదంగా జరుగుతాయి. వరుడు ఎప్పుడూ వినయంగా ఉండాలని ఈ ఆచారం సూచిస్తుంది.

విదేశీయులు కూడా వివాహాల వింత ఆచారాల్లో వెనుకంజ వేయరు

చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లికి నెల రోజుల ముందు నుంచి వధువు రోజూ ఏడ్వడం ఆనవాయితీ.
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, పెళ్లికూతురు తల్లి పెళ్లయిన జంటతో పడుకోవడం ఆనవాయితీ.
స్కాట్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువుపై మసి వేస్తారు. చాలా చోట్ల వధూవరులపై దుమ్మెత్తి పోస్తారు.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!

Follow Us