Chicken Rate Hits All Time High : మార్కెట్‌లో చికెన్ రేట్ మళ్లీ మండిపోతుంది.. పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి జనాలందరు లబో దిబో మంటున్నారు. ఆదివారం చికెన్ ధర సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా కిలో రూ.306కు చేరి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఇంత రేట్ ఎప్పుడు నమోదుకాలేదని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కరోనాకు ముందు కిలో చికెన్ రూ.270 వరకు అత్యధికంగా విక్రయించామని కానీ ఇంత పెద్ద మొత్తంలో రేట్లు ఎప్పుడు పెరగలేదని వ్యాపారులు అంటున్నారు.
కరోనాకు తోడు బర్డ్ ప్లూ కూడా చేరడంతో తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఉత్పత్తిని చాలామంది ఆపేశారని, అందువల్లే ఇప్పుడు డిమాండ్‌కు తగిన సరఫరా చేయలేకపోతున్నామని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్నాళ్ల నుంచి బ్రాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా చికెన్ ధర పెరగడానికి ఇదే కారణం. దీంతో చికెన్ ప్రియులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చికెన్ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర.. మార్చి 31వ తేదీకి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 3న రూ.296కు పెరిగింది. తాజాగా ఆదివారం రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది. విజయవాడ జోన్‌లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ రేటు జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి దిగివచ్చింది. ఇదే కాకుండా ఎండాకాలంలో అధిక వేడికి కోళ్లు చనిపోతాయని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. సరిగ్గా తిండి తినక, నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎదుగుదల కూడా ఎక్కువగా ఉండదంటున్నారు. ఫలితంగా డిమాండ్‌కు సరిపడినన్ని కోళ్లు లభ్యం కావడం లేదు అందుకే చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయని అంటున్నారు. కొన్ని రోజుల వరకు పరిస్థితి ఇదే మాదిరిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.