Hyderabad Police Done Funerals: మాయదారి రోగం పుణ్యమాని మనవాళ్లు కూడా దరి చేరని పరిస్థితి నెలకొంది. ఎవరికో ఒకరికి అంటుకుంటే చాలు ఇంటిల్లిపాదిని హింస పెడుతోంది. కరోనా ఎన్నో కుటుంబాల జీవితాలను రోడ్డున పడేయమే కాదు ..తమ వారిని కనీసం చివరి చూపుకు కూడ నోచుకోని దయనీయ స్థితిని తీసుకువచ్చింది. కరోనా సోకడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు అనేక మంది తమ ప్రాణాలకు వదులుతున్న విషయం తెలిసిందే..అయితే మృతులకు అందరు ఉన్నా.. దగ్గరికి వచ్చి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి కరోనా కల్గిస్తోంది.
ఈ నేపథ్యంలోనే చాల మంది మృతదేహాలను ప్రభుత్వ వర్గాలే ఖననం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొందరు స్వచ్చంధ సంస్థల నిర్వహకులు సైతం ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనలో పోలీసులు తమ కర్కశత్వం మాటున కారుణ్యం దాగి ఉందని నిరూపించారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వారి తరుఫున కరోనా మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా కొమరాడ గ్రామానికి చెందిన గున్నయ్యకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. కూతుళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుండగా, గున్నయ్య కొడుకుతో కలిసి హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పరిధిలో కలిసి ఉంటున్నాడు. అయితే, తండ్రి కొడుకులు ఇద్దరూ.. వారం రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఇద్దరు గాంధీలో చేరి చికిత్స పొందుతుండగా గున్నయ్య ఈనెల 25న మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరు రాని పరిస్థితి నెలకొంది.
ఓ వైపు కన్న కొడుకు కరోనా చికిత్స పొందుతుండగా.. ఏపీలో ఉన్న ఇద్దరు కూతుళ్లు లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా రాలేని స్థితిలో ఏర్పడింది. దీంతో తండ్రి గున్నయ్య శవానికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించాలని ఏపిలో ఉన్న గున్నయ్య కూతుళ్లు పోలీసులను కోరారు.
కుటుంబసభ్యుల వినతితో జవహర్‌నగర్ పోలీసులు దగ్గరుండి గున్నయ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, కరోనాతో మృతి చెందిన వారి దగ్గరికి కనీసం కుటుంబ సభ్యులే రాని దీన స్థితి నెలకొంది. కాని, పోలీసులు ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడంతో స్థానిక ప్రజలు వారిని అభినందిస్తున్నారు.