
గతంలో గ్రామాల్లో మాత్రమే వినిపించే వీధి కుక్కల భయం.. ఇప్పుడు నగరాల్లోని బస్తీలు, హైటెక్ సందులకు కూడా వ్యాపించింది. పాఠశాలకు వెళ్లే చిన్నారులు, మార్నింగ్ వాక్‌కు వెళ్లే వృద్ధులు, ఒంటరి మహిళలే లక్ష్యంగా కుక్కలు దాడులకు తెగబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కుక్క ఎదురైనప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే ప్రాణాపాయానికి దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కుక్క మొరగగానే మన మెదడు ఇచ్చే మొదటి ఆదేశం పారిపో.. కానీ జంతు మనస్తత్వ శాస్త్రం ప్రకారం.. మీరు పరిగెత్తడం మొదలుపెడితే కుక్కలోని వేట స్వభావం మేల్కొంటుంది. మిమ్మల్ని ఒక వేటగా భావించి అది మరింత వేగంగా వెంబడిస్తుంది.
కుక్క మొరుగుతున్నప్పుడు భయం వేసినా సరే, నిశ్చలంగా నిలబడండి. చేతులను ఊపకండి, శరీరాన్ని బిగదీయకండి. ముఖ్యంగా కుక్క కళ్లలోకి నేరుగా చూడకండి.. అది దానికి ఒక సవాలుగా అనిపిస్తుంది. మీరు నిశ్చలంగా ఉంటే అది తనంతట తానుగానే వెనక్కి తగ్గుతుంది.
బైక్ వెనుక కుక్కలు పడటం వల్ల కుక్క కాటు కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. బైక్ శబ్దం, చక్రాల కదలిక కుక్కలను ఆకర్షిస్తాయి. అదేవిధంగా టైర్ల నుంచి వచ్చే వాసన గుర్తించి కూడా కుక్కలు అరుస్తుంటాయి. ఆ సమయంలో మీరు వేగం పెంచితే పడిపోయే ప్రమాదం ఉంది. కుక్క వెంబడిస్తున్నప్పుడు వేగం పెంచకుండా నెమ్మదిగా వాహనాన్ని ఆపండి. కదలిక ఆగగానే కుక్క తన ఆసక్తిని కోల్పోయి వెనక్కి వెళ్లిపోతుంది.
వాకింగ్‌కు వెళ్లేవారు తమ వెంట గొడుగు లేదా బలమైన కర్ర ఉంచుకోవడం ఉత్తమం. కుక్క దగ్గరకు వచ్చినప్పుడు కర్రతో నేలను కొట్టడం లేదా గొడుగును అకస్మాత్తుగా విప్పడం ద్వారా దాన్ని భయపెట్టవచ్చు. ఒకవేళ మీ దగ్గర బిస్కెట్లు లేదా ఆహారం ఉంటే వాటిని కుక్కకు దూరంగా విసిరి దాని దృష్టి మళ్ళించవచ్చు.
చాలామంది కుక్క కరిస్తేనే ఆసుపత్రికి వెళ్తారు. కానీ టీకాలు వేయని వీధి కుక్క గోళ్లతో గీకినా లేదా చిన్న గాయం చేసినా రేబిస్ వచ్చే అవకాశం ఉంది. రేబిస్ ప్రాణాంతక వ్యాధి. కాబట్టి చిన్న గీత పడినా వెంటనే వైద్యుడిని సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.
కుక్కలు సహజంగా క్రూరమైనవి కావు. ఆకలి, భయం లేదా తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే తపనతోనే అవి దూకుడుగా మారుతాయి. ఆ సమయంలో మనం చూపే సంయమనం, తీసుకునే జాగ్రత్తలే మనల్ని సురక్షితంగా ఉంచుతాయి.