పోలీసువారు అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇబ్బందులకు గురిచేస్తే ఇలా చేయండి..

పోలీసుల దుష్ప్రవర్తన చట్టవిరుద్ధమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఎలా ఫిర్యాదు చేయాలి, ఏ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, మానవ హక్కుల కమిషన్‌ను ఎలా సంప్రదించాలి వంటి అంశాలను న్యాయవాది న్యాయనిపుణులు వివరించారు. మీ హక్కులను తెలుసుకుని, భయం లేకుండా పోరాడాలని చెబుతున్నారు.

పోలీసువారు అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇబ్బందులకు గురిచేస్తే ఇలా చేయండి..
Police Misconduct

Updated on: Apr 15, 2026 | 3:19 PM

పోలీసు అధికారులు ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం లేదా శారీరకంగా హింసించడం చట్టవిరుద్ధమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు లేదా ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, కొట్టే హక్కు గానీ, దుర్భాషలాడే హక్కు గానీ వారికి లేదని ప్రముఖ న్యాయవాదులు వివరిస్తున్నారు. ఈ నిబంధనలు దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ అమలులో ఉన్నాయని తెలియజేశారు. చాలామంది ప్రజలు పోలీసుల నుంచి ఇలాంటి దుష్ప్రవర్తనను ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ పోలీసులు అరే, ఒరే అని సంబోధించడం, శారీరకంగా హింసించడం లేదా “నిన్ను బొక్కలో వేస్తా”, “మెడలు ఇరగ్గొడతా” వంటి బెదిరింపులకు పాల్పడటం కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే, అలాంటి చర్యలకు పాల్పడే అధికారం పోలీసులకు లేదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు అక్రమంగా వ్యవహరిస్తే, అది చట్టపరంగా నేరంగా పరిగణించబడుతుంది. పోలీసుల దుష్ప్రవర్తనను ఎదుర్కొన్నప్పుడు ప్రజలు భయపడకుండా తమ హక్కులను వినియోగించుకోవాలని న్యాయవాదుల సలహా.

ముందుగా, పోలీసులు అడిగిన ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలి. అయినప్పటికీ వారు దురుసుగా ప్రవర్తిస్తే, అందుబాటులో ఉన్న సెల్ ఫోన్‌లతో ఆ ఘటనను రికార్డు చేయాలి. ఒకవేళ రికార్డు చేయలేకపోతే, ఆ విషయాన్ని జిల్లా ఎస్పీ లేదా డీజీపీ వంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదట, మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేయవచ్చు. NHRCకి ఫిర్యాదు చేస్తే, అక్కడి నుంచి ఫిర్యాదుదారునికి, పోలీసు అధికారులకు లేఖలు వస్తాయి. రెండవది, శారీరక హింస లేదా ఇతర బాధలకు గురైన సందర్భంలో, BNS సెక్షన్లు 166 లేదా 166A కింద ప్రైవేట్ ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. అదనంగా, పోలీసులు దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు, BNSలోని సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు),  330 (వాంగ్మూలం లేదా ఆస్తిని బలవంతంగా రాబట్టడానికి గాయపరచడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని పక్షంలో, హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియా ద్వారా తమ బాధను తెలియజేయడం, ప్రెస్ మీట్‌లు నిర్వహించడం, సంఘ సభ్యుల మద్దతుతో సమిష్టిగా ప్రశ్నించడం ద్వారా కూడా ప్రజలు చైతన్యాన్ని తీసుకురావచ్చని న్యాయవాదులు సూచించారు. D.K. Basu vs. Union of India కేసులో అరెస్టు చేయబడిన వ్యక్తుల హక్కుల గురించి స్పష్టంగా పేర్కొనబడింది. ప్రజలు తమ హక్కుల గురించి తెలుసుకొని, భయం లేకుండా తమపై జరిగే అన్యాయాలపై పోరాడాలని, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Also Read: పాము కాటు వేసినా ముంగిస చనిపోదా..? దానికి ఏం కాదా..? 

Follow Us